తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి
దేవరకొండ, ఆగస్టు 29 (అయుష్ 24 న్యూస్):
తెలుగు భాష పరిరక్షణ కోసం ఎంతోమంది కవులు, సాహితీవేత్తలు తమ జీవితాలను అంకితం చేసి తెలుగు భాష ఖ్యాతిని, ఔన్నత్యాన్ని, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించారని దేవరకొండ మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి అన్నారు.
గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి ఆధ్వర్యంలో “తెలుగు భాషా దినోత్సవం” కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలుగు భాష గొప్పతనాన్ని, దాని వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవాలని సూచించారు.
కళాశాల వైస్ ప్రిన్సిపాల్, తెలుగు విభాగాధిపతి జి. కోటయ్య మాట్లాడుతూ తెలుగు భాష కేవలం భావాలను వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదన్నారు. మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, తల్లిదండ్రుల జ్ఞాపకాలు, తెలుగు నేల మట్టి వాసనతో ముడిపడి ఉన్న జీవన భాష తెలుగు అని పేర్కొన్నారు.

మన మూలాలను మరచిపోకుండా మాతృభాషను కాపాడుకుంటూనే ఇతర భాషల్లోని జ్ఞానాన్ని కూడా పొందాలని ఆయన సూచించారు. ఇతర భాషలను నేర్చుకోవడం అవసరమే అయినప్పటికీ, మాతృభాషపై అభిమానం, గౌరవం ఎప్పటికీ తగ్గకూడదన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జి. లింగారెడ్డి, నాగేందర్, ఎ. శ్రీను, శివకృష్ణ, సిహెచ్. శ్రీనివాస్, నర్మదాదేవి తదితర అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
📰 అయుష్ 24 న్యూస్
THE VOICE OF TRUTH










Leave a Reply