ఫిరంగి సైతం మూలన పడిన వైనం – చారిత్రక సంపదను కాపాడాలని పట్టణ వాసుల విజ్ఞప్తి
దేవరకొండ, ఆగస్టు 26: చారిత్రక నేపథ్యం కలిగిన దేవరకొండ ఖిల్లా దుర్గానికి చెందిన శిల్పకళా సంపద నిరాదరణకు గురవుతోందని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రేచర్ల వెలమ రాజుల రాజధానిగా ప్రసిద్ధిగాంచిన దేవరకొండ దుర్గానికి సంబంధించిన పురాతన విగ్రహాలు, ఫిరంగి తదితర చారిత్రక ఆనవాళ్లు ప్రస్తుతం సరైన సంరక్షణకు నోచుకోకపోవడంపై చరిత్రాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్రీ.శ. 14వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు రేచర్ల వెలమ రాజులు దేవరకొండను రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన దేవరకొండ ఖిల్లా దుర్గానికి సంబంధించిన శిల్పకళా సంపదను కాపాడాల్సిన అవసరం ఉందని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
మురికి కూపంలో పురాతన విగ్రహాలు
దేవరకొండ తహసిల్దార్ కార్యాలయం వెనుక భాగంలో చెత్తాచెదారం, దుర్గంధం మధ్య పురాతన విగ్రహాలు పడి ఉండటం పట్ల చరిత్రాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని విగ్రహాలు తల, మొండెం, కాళ్లు విడివిడిగా కనిపిస్తున్నాయని, వాటి చుట్టూ అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉందని తెలిపారు.

దేవరకొండకు చెందిన చరిత్రాభిమాని పున్న శ్రీనివాసులు బుధవారం ఈ విషయాన్ని పత్రికల దృష్టికి తీసుకువచ్చారు. ఆనాటి రాజుల కాలానికి చెందిన విగ్రహాలు ఒకప్పుడు పూజలందుకున్న చారిత్రక సంపదగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం వాటి పరిస్థితి చూస్తే మనసు కలచివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మూలన పడిన చిన్న ఫిరంగి
దేవరకొండ ఖిల్లా దుర్గానికి సంబంధించిన చిన్న ఫిరంగి కూడా తహసిల్దార్ కార్యాలయంలో మూలన పడి ఉందని శ్రీనివాసులు తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఫిరంగిని చెత్తలో పడేయకుండా, దేవరకొండ ఖిల్లా పార్కులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

ఖిల్లా పార్కులో భద్రత కల్పించాలని విజ్ఞప్తి
విగ్రహాలను సీసీ కెమెరాల నిఘా ఉన్న సురక్షిత ప్రదేశమైన దేవరకొండ ఖిల్లా పార్కులో ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా దేవరకొండ ప్రాంత చరిత్రకు సంబంధించిన వివరాలను కూడా పార్కులో ప్రదర్శిస్తే పర్యాటకులకు, విద్యార్థులకు చారిత్రక అవగాహన కలుగుతుందని తెలిపారు.
చారిత్రక ఆనవాళ్లను పునరుద్ధరించాలి
దేవరకొండ ఖిల్లా దుర్గం ముఖద్వారం కుడివైపున ఉన్న చారిత్రక శాసనం భూమిలోకి కూరుకుపోయే పరిస్థితిలో ఉందని, పార్కు మొదటి భాగంలో ఉన్న పురాతన ద్వారం ఆనవాళ్లు కూడా కనుమరుగవుతున్నాయని పున్న శ్రీనివాసులు పేర్కొన్నారు. వీటిని శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరించి భద్రపరచాల్సిన అవసరం ఉందన్నారు.
నల్లగొండ మ్యూజియం నుంచి విగ్రహాలను తిరిగి తీసుకురావాలి
దేవరకొండ ఖిల్లా దుర్గం ముఖద్వారం ఎదురుగా ఉన్న రాతి శిల్పాలు, నంది విగ్రహం తదితర చారిత్రక వస్తువులను గతంలో దొంగతనాల నుంచి రక్షించేందుకు నల్లగొండ మ్యూజియంకు తరలించారని శ్రీనివాసులు తెలిపారు. వాటిని తిరిగి దేవరకొండ ఖిల్లా దుర్గానికి తీసుకువచ్చి, అక్కడి పార్కులో సురక్షితంగా ఏర్పాటు చేయాలని కోరారు.
దేవరకొండ ఖిల్లా దుర్గం చారిత్రక వైభవాన్ని కాపాడేందుకు పురపాలక, రెవెన్యూ, పురావస్తు శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, పురాతన విగ్రహాలు, ఫిరంగి, శాసనాలు, ఇతర చారిత్రక ఆనవాళ్లకు తగిన సంరక్షణ కల్పించాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అయుష్ 24 న్యూస్










Leave a Reply