బొమ్మిడి నాయకర్‌కు మత్స్యకార సామాజిక వర్గం అండగా ఉంటుంది
తాడేపల్లి, సెప్టెంబర్ 3 (అయుష్ 24 న్యూస్): మొగల్తూరులో సెప్టెంబర్ 1న నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, ప్రజాసేవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరును అభినందించారని పల్లవ సేన రాష్ట్ర అధ్యక్షులు కొల్లాటి బాబురావు, ఏపీ ఫిషర్‌మెన్ జేఏసీ చైర్మన్, హైకోర్టు న్యాయవాది సైకం రాజశేఖర్ తెలిపారు.
గురువారం తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. మత్స్యకారులతో కలిసి గోదావరిలోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే పీపీపీ విధానంపై ముఖ్యమంత్రి చేసిన సూచనలను వక్రీకరిస్తూ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరు బాగోలేదంటూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని వారు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రజావేదికపై మాట్లాడిన పూర్తి వీడియోను పరిశీలిస్తే వాస్తవాలు స్పష్టమవుతాయని అన్నారు.
ఎమ్మెల్యే నాయకర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి తగిన సమాధానం ఇస్తామని, రాష్ట్రంలోని మత్స్యకారులంతా నాయకర్‌కు అండగా ఉంటారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
బొమ్మిడి నాయకర్‌కు మా సామాజిక వర్గం పూర్తి మద్దతు
బొమ్మిడి నాయకర్‌కు తమ సామాజిక వర్గం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బాబురావు, రాజశేఖర్ స్పష్టం చేశారు. కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయంతో పాటు, మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ విజయానికి కూడా తమ సామాజిక వర్గం మమేకమై పనిచేసిందని తెలిపారు.
ఇచ్చాపురం నుంచి తడ వరకు తమ సామాజిక వర్గం బొమ్మిడి నాయకర్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రాజకీయంగా, సామాజికంగా ఆయనకు పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
“మంచిని పదిమందిలో చెప్పాలి.. చెడును చెవిలో చెప్పాలి” అనే విధానాన్ని పాటించాలని వారు సూచించారు.
ఈ సమావేశంలో జేఏసీ నాయకులు నాగిడి శివరాం, నడకుదీటి నాగరాజు, వాటిపల్లి అర్జునరావు, గాడి రామారావు, మల్లాడి నాగబాబు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply