మదర్ థెరిస్సా పొదుపు సమితిపై ఆరోపణలు సరికాదు
వాస్తవాలు, లెక్కలు మా వద్ద ఉన్నాయి
మీడియా సమావేశంలో సమితి నిర్వాహకుల స్పష్టీకరణ
మంథని: మదర్ థెరిస్సా పొదుపు సమితిపై నామని హరికృష్ణ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని సమితి లోడీ సంస్థ మంథని డివిజన్ కోఆర్డినేటర్ మేకల మల్లేశం తెలిపారు.
శనివారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఆర్థికంగా చేయూత అందించాలనే ఉద్దేశంతో 2001 నవంబర్ 1న మదర్ థెరిస్సా పొదుపు సమితిని ప్రారంభించామని తెలిపారు. అప్పటి నుంచి సమితి దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోందన్నారు.
సమితిపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ పత్రికల ద్వారా ప్రచారం చేయడం తమను తీవ్రంగా ఆవేదనకు గురిచేస్తోందన్నారు. సమితికి సంబంధించిన లెక్కలు, వాస్తవాలను మీడియా ముందు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
సమితి అధ్యక్షురాలు మాదేశి పద్మ మాట్లాడుతూ.. 2001లో ప్రారంభమైన సమితి 26 సంవత్సరాలుగా కొనసాగుతోందని తెలిపారు. సంస్థకు సంబంధించిన అన్ని లెక్కలు, వివరాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని మీడియా ముందు ప్రవేశపెట్టామని చెప్పారు. నిరాధార ఆరోపణలతో సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడం సరికాదన్నారు.
సమితి కోశాధికారి నామని సుగుణ మాట్లాడుతూ.. సమితి అభివృద్ధి చెందుతుండటాన్ని ఓర్వలేకనే నామని హరికృష్ణ తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. రూపాయి నుంచి ప్రారంభమైన సమితి నేడు ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తెరిసా ఆశయాలను, మహిళల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.
సమితిపై తప్పుడు ఆరోపణలు చేసిన అంశాన్ని సంబంధిత శాఖల అధికారులు సమగ్రంగా పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని సమితి సభ్యులు కోరారు. సంస్థకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికే ఈ విలేకరుల సమావేశం నిర్వహించినట్లు వారు తెలిపారు.
ఈ సమావేశంలో సమితి డైరెక్టర్లు ఎలగందుల సరిత, పుల్లె లక్ష్మి, పుల్లె రాజేశ్వరి, తాత యాదమ్మ, ముప్పిడి మల్లేశ్వరి, ఎర్ర రాజేశ్వరి, మైదం శారద తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply