నస్కల్ బ్రిడ్జి పనులను పరిశీలించిన పరిగి ఎమ్మెల్యే
రహదారులు, రైల్వే, విద్య, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
పరిగి: పరిగి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగని రీతిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు.
పరిగి–వికారాబాద్ ప్రధాన రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న నస్కల్ బ్రిడ్జి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అధికారులతో, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా కాకముందే నస్కల్ వద్ద బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నస్కల్ బ్రిడ్జి పక్కనే మరో బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా చేపడుతున్నామని పేర్కొన్నారు.
పరిగి–వికారాబాద్ ప్రధాన రహదారిని నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తున్నామని, పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే పరిగి–షాద్‌నగర్ వరకు నాలుగు లైన్ల రహదారి పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు.
గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రాఘవపూర్–నంచర్ల వరకు డబుల్ లైన్ రహదారి నిర్మాణం చేపట్టామని, ప్రస్తుతం దానిని నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిగికి వచ్చిన సందర్భంగా ప్రకటించారని తెలిపారు.
రేడియల్ రోడ్డు భూసేకరణ పనులు పూర్తయ్యాయని, త్వరలో రహదారి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. గడిసింగాపూర్–రంగారెడ్డిపల్లి, లాల్‌పహాడ్–చిట్టంపల్లి మార్గాల్లో డబుల్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
అప్పా జంక్షన్–మన్నెగూడ నాలుగు లైన్ల రహదారి పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ రహదారి నిర్మాణానికి గతంలో అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించి, పనులను దగ్గరుండి ప్రారంభించినట్లు తెలిపారు.
రైల్వే, విద్యా రంగంలోనూ అభివృద్ధి
వికారాబాద్–పరిగి–నస్కల్ రైల్వే స్టేషన్ మీదుగా కొడంగల్ వరకు రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.
పరిగి పట్టణంలోని తుంకలగడ్డలో సుమారు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఆధునిక వసతులతో నిర్మిస్తున్నామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. రహదారులు, రైల్వే, విద్య, మౌలిక వసతులు తదితర అన్ని రంగాల్లో పరిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
భవిష్యత్‌లో పరిగి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
అయుష్ 24 న్యూస్










Leave a Reply