దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
హైదరాబాద్, ఆగస్టు 21, అయుష్ 24 న్యూస్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో కలిసి బాలు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపై అధిష్ఠానం కఠినంగా వ్యవహరించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పదేళ్లపాటు కార్యకర్తలు, నాయకులు ఎంతో కష్టపడ్డారని, కేసులు ఎదుర్కొని, ఆస్తులు కోల్పోయి, ప్రాణాలను సైతం త్యాగం చేశారని బాలు నాయక్ పేర్కొన్నారు. అలాంటి కార్యకర్తల కృషిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ పార్టీని, పార్టీ నాయకత్వాన్ని అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తున్న వారిని ప్రజాప్రతినిధులుగా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజకీయంగా బలహీనపరిచేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సాధ్యం కాక కాంగ్రెస్ పార్టీలోని కొందరిని ఉపయోగించుకుని కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ ఎందుకు స్పందించలేదని ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రశ్నించారు. పార్టీపై, పార్టీ నాయకత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు, కార్యక్రమాలు చేస్తున్న వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడుతున్న ప్రతి కార్యకర్త, నాయకుడి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వంపై ఉందని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము స్వాగతిస్తామని ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు.










Leave a Reply