న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేసిన బీఆర్‌ఎస్ నాయకుడు రామావత్ రమేష్ నాయక్
దేవరకొండ, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): కొండమల్లేపల్లి మండలంలోని పెళ్లిపాకల రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న దేవరోని తండాకు చెందిన పేద రైతులకు న్యాయం చేయాలని బీఆర్‌ఎస్ నాయకుడు రామావత్ రమేష్ నాయక్ డిమాండ్ చేశారు.
రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు భూములను కేటాయిస్తున్న నేపథ్యంలో, ఇందుకోసం పేద రైతుల పట్టా భూములు సేకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ భూములకు నిర్ణయిస్తున్న పరిహారం, కన్వర్షన్ విలువ తక్కువగా ఉందని పేర్కొన్నారు.
ఈ విషయంపై శుక్రవారం దేవరకొండ సబ్‌కలెక్టర్‌ను కలిసి రైతుల సమస్యలను వివరంగా వివరించినట్లు రమేష్ నాయక్ తెలిపారు. రిజర్వాయర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించాలని కోరారు.

ఒకవైపు ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులవుతున్న కుటుంబాలకు పునరావాసం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, అదే సమయంలో పునరావాసం కోసం తమ భూములను కోల్పోతున్న పేద రైతుల ప్రయోజనాలను కూడా కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
భూముల వాస్తవ విలువను పరిగణనలోకి తీసుకుని న్యాయమైన పరిహారం అందించాలని రమేష్ నాయక్ కోరారు. తక్కువ విలువకు భూములు సేకరిస్తే పేద రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రైతులకు అన్యాయం జరిగితే వారి తరఫున సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, అవసరమైన స్థాయిలో పోరాటం చేస్తానని రమేష్ నాయక్ స్పష్టం చేశారు.
“ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయడం ఎంత ముఖ్యమో.. వారి పునరావాసం కోసం భూములు కోల్పోతున్న పేద రైతులకు న్యాయం చేయడం కూడా అంతే ముఖ్యం” అని ఆయన అన్నారు.



Musini.Anjan





Leave a Reply