చీత్రియాలలో ఒకేసారి ఏడు ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశాలు
చందంపేటలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు కృషి చేస్తా: ఎమ్మెల్యే బాలు నాయక్
చందంపేట, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
పేదవాడి చిరకాల స్వప్నమైన సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. చందంపేట మండలం చీత్రియాల గ్రామంలో బుధవారం ఒకేసారి ఏడు నూతన ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొని లబ్ధిదారుల కుటుంబాలను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తూ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి వారి స్వంత స్థలంలోనే ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. చందంపేట మండలంలో ఇందిరమ్మ ఇళ్ల సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఏ ఒక్క పేద కుటుంబం కూడా సొంత ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో మొదటి విడతలో 3,500 ఇళ్లను మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గృహప్రవేశాల అనంతరం లబ్ధిదారుల కుటుంబాలు ఎమ్మెల్యే బాలు నాయక్‌ను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఆనందంగా గృహప్రవేశం చేసుకున్న లబ్ధిదారులు

చీత్రియాల గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో తమకు సొంత ఇల్లు అందలేదని, ప్రస్తుతం ఎమ్మెల్యే బాలు నాయక్ చొరవతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని తెలిపారు. నూతన గృహాల్లో గృహప్రవేశం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం మరింత కాలం కొనసాగాలని వారు ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే బాలు నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చీత్రియాల మాజీ సర్పంచ్ కాకునూరి రంగయ్య గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డేటి మల్లారెడ్డి, కిన్నెర హరికృష్ణ, గిరి, ఏడుపుల గోవిందు, మారుపాకుల సురేష్ గౌడ్, బధ్యా నాయక్, సురేందర్ రెడ్డి, వెంకటయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply