రూ.63.83 కోట్లతో గ్రోయిన్స్, రివిట్‌మెంట్ నిర్మాణం.. గత వరదల్లోనూ చెక్కుచెదరని రక్షణ పనులు
ఆలమూరు, సెప్టెంబర్ 3 | అయుష్ 24 న్యూస్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో నదీకోత నివారణకు చేపట్టిన భారీ రక్షణ పనులు ఫలితాలను ఇస్తున్నాయి. గత ఏడాది వరదల సమయంలో నదీకోతతో తీవ్ర ఆందోళనకు గురైన రైతులు, గ్రామస్థులకు ప్రస్తుతం కొంత ఊరట లభించింది. రిలయన్స్ పైప్‌లైన్ సంస్థ సహకారంతో రూ.63.83 కోట్ల వ్యయంతో గ్రోయిన్స్, రివిట్‌మెంట్ నిర్మాణ పనులు చేపట్టారు.
బడుగువానిలంకలో కోట్లాది రూపాయల విలువైన వందల ఎకరాల లంక భూములు గతంలో గోదావరి నదీకోతకు గురయ్యాయి. పుష్కరాల రేవుకు అటు, ఇటు 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో, అప్పటి ఆలమూరు ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి ఆధ్వర్యంలో రివిట్‌మెంట్లు, గ్రోయిన్స్ నిర్మించడంతో కొంతకాలం నదీకోతకు అడ్డుకట్ట పడింది.
అయితే రిలయన్స్ పైప్‌లైన్ నిర్మించిన ప్రాంతంలో అనంతరం నదీకోత తీవ్రత పెరిగింది. సమస్య పరిష్కారానికి రిలయన్స్ అనుబంధ సంస్థ పైప్‌లైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (PIL) ఆధ్వర్యంలో 2023లో సుమారు కిలోమీటరున్నర మేర రూ.41.63 కోట్లతో రివిట్‌మెంట్ నిర్మించారు. అయితే వరదల సమయంలో ఆ రివిట్‌మెంట్‌లో కొంత భాగం దెబ్బతినడంతో పంట భూములకు మళ్లీ నదీకోత ముప్పు ఏర్పడింది.
ఐఐటీ నిపుణుల సాంకేతిక రూపకల్పన
ఈ నేపథ్యంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్ ద్వారా సమస్యను రిలయన్స్ సంస్థ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పరిస్థితిని పరిశీలించిన సంస్థ రూ.63.83 కోట్ల నిధులను మంజూరు చేయగా, స్థానిక స్థాయిలో కాకుండా చెన్నై ఐఐటీ నిపుణుల సాంకేతిక సూచనలతో కొత్త గ్రోయిన్స్‌ను డిజైన్ చేసినట్లు అధికారులు తెలిపారు.

పటిష్టమైన రాతి నిర్మాణంతో గ్రోయిన్స్‌ను ఏర్పాటు చేశారు. పాత రివిట్‌మెంట్ నుంచి మొదటి గ్రోయిన్‌ను ధవళేశ్వరం బ్యారేజీ వైపు గోదావరిలోకి 40 మీటర్ల పొడవున, రెండో, మూడో గ్రోయిన్స్‌ను 45 మీటర్ల పొడవున, నాలుగో గ్రోయిన్‌ను రావులపాలెం వైపు 30 మీటర్ల పొడవున నిర్మించినట్లు వివరించారు.
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి విడుదలయ్యే వరద నీటి ప్రవాహ వేగాన్ని నియంత్రించే విధంగా ఈ నిర్మాణాలు చేపట్టడంతో నదీకోత తీవ్రత తగ్గినట్లు స్థానికులు చెబుతున్నారు. గత వరదల్లో దెబ్బతిన్న సుమారు 125 మీటర్ల రివిట్‌మెంట్‌ను కూడా పటిష్టం చేశారు.
వరదల్లోనూ చెక్కుచెదరని నిర్మాణాలు
ఇటీవల వచ్చిన వరదలకు సైతం రక్షణ పనులు పెద్దగా దెబ్బతినకపోవడంతో రైతులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. నదీకోతను నియంత్రించడంలో గ్రోయిన్స్, రివిట్‌మెంట్ నిర్మాణాలు కీలకంగా మారాయని స్థానికులు పేర్కొంటున్నారు.
ఇక భారీ స్థాయిలో నిర్మాణ సామగ్రిని తరలించేందుకు వేలాది వాహనాలు రాకపోకలు సాగించడంతో కాంట్రాక్టు సంస్థ పుంత రహదారులను కూడా పటిష్టం చేసినట్లు సమాచారం. దీంతో నిర్మాణ పనులతో పాటు స్థానిక రైతులకు రహదారి సౌకర్యం కూడా మెరుగుపడింది.
నదీకోత ముప్పు నుంచి తమ భూములకు రక్షణ కల్పించేందుకు చేపట్టిన పనులకు సహకరించిన రిలయన్స్ పైప్‌లైన్ సంస్థ, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్, సంబంధిత అధికారులు తదితరులకు బడుగువానిలంక గ్రామస్థులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్










Leave a Reply