హైదరాబాద్, సెప్టెంబర్ 8: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరుపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాసనసభ స్పీకర్‌ను దూషించిన సభ్యులపై చర్యలు తీసుకుని సభ నుంచి బహిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.
మంగళవారం శాసన మండలి సమావేశాల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళా పోలీసుల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ ఘటనపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించినట్లయితే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
బీఆర్ఎస్పై విమర్శలు చేస్తూ గిరిజన, దళిత, అణగారిన వర్గాల పట్ల ఆ పార్టీకి వ్యతిరేక వైఖరి ఉందని మంత్రి ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎదగడాన్ని బీఆర్ఎస్ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టుకుని రాజకీయాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు.
మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని సీతక్క స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను దూషిస్తే సంబంధిత చట్టాలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల వ్యవహారశైలిపైనా మంత్రి తీవ్రంగా స్పందించారు. హరీశ్ రావు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లడాన్ని ప్రస్తావిస్తూ.. స్పీకర్‌ను కొట్టే ఉద్దేశంతోనే అలా చేస్తున్నారా అని ప్రశ్నించారు. నిన్న దూషణలకు పాల్పడ్డారని, ఇవాళ దాడికి దిగుతారా అంటూ వ్యాఖ్యానించారు.
సభా సంప్రదాయాలు, నైతిక విలువలను సభ్యులు పాటించాలని మంత్రి సూచించారు. స్పీకర్‌కు ఇప్పటివరకు క్షమాపణ చెప్పకపోవడాన్ని తప్పుబట్టారు.
2018లో స్పీకర్‌పై దాడి ఘటనలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆర్టికల్ 194(3) ప్రయోగించి సస్పెండ్ చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. అదే నిబంధనలను బీఆర్ఎస్ సభ్యులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ సభ్యుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.
– అయుష్ 24 న్యూస్ ప్రతినిధి, హైదరాబాద్









Leave a Reply