ఆటో కార్మిక సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు సఫలం
ప్రభుత్వ హామీలతో నిరవధిక సమ్మె విరమించిన ఆటో కార్మిక సంఘాలు
హైదరాబాద్, ఆగస్టు 24, అయుష్ 24 న్యూస్: ఆటో కార్మిక సంఘాలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఆటో కార్మిక సంఘాల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి స్పందించి నిరవధిక బంద్‌ను విరమించిన ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
ఆటో కార్మికుల కోసం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు

ఈవీ ఆటోలపై స్పష్టత:
ఆర్టీసీ తరఫున ఈవీ ఆటోలు కొనుగోలు చేసే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. దీనిపై జరుగుతున్న ప్రచారం దుష్ప్రచారం మాత్రమేనని తెలిపారు.
కార్మిక సంక్షేమ బోర్డు:
ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. బోర్డు విధివిధానాలపై సెప్టెంబర్ 1న కార్మిక శాఖ, రవాణా శాఖ అధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు.
ఆటో చార్జీల పెంపు:
2012 తర్వాత ఆటో చార్జీలు పెంచలేదని గుర్తించిన ప్రభుత్వం, చార్జీల పెంపునకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఎంత మేర చార్జీలు పెంచాలనే అంశంపై తగిన నివేదిక తీసుకుని, అనంతరం సంబంధిత జీవో జారీ చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్:
ఓలా, ఉబెర్ తరహాలో ప్రభుత్వం తరఫున ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఐటీ శాఖ ద్వారా అవసరమైన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.
రాపిడో, ఓలా, ఉబెర్ ద్విచక్ర వాహన సేవలు:
ద్విచక్ర వాహనాల ద్వారా రాపిడో, ఓలా, ఉబెర్ వంటి ప్రయాణికుల రవాణా సేవలను ఎల్లో ప్లేట్ ఉన్న వాహనాలకే పరిమితం చేసే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
రూ.12 వేల ఆర్థిక సహాయం:
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు రూ.12 వేల సహాయం అందించే అంశాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
పాత ఆటోలను ఈవీలుగా మార్చేందుకు రూ.1.50 లక్షల సహాయం
హైదరాబాద్ క్యూర్ ఏరియా పరిధిలోని పాత డీజిల్, పెట్రోల్ ఆటోలను రెట్రోఫిట్మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ప్రభుత్వం రూ.1.50 లక్షల వరకు సహాయం అందించనుందని మంత్రి తెలిపారు.

కొత్త ఆటోలు కొనుగోలు చేసే వారికి సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నగరంలో ఈవీ ఆటోలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు.
“ఆటో కార్మిక సోదరుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉంది. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది” అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ చర్చల్లో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్
నిజం మా ధ్యేయం… ప్రజలే మా బలం…










Leave a Reply