‘తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్’కు వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌పై చర్చ
హైదరాబాద్: సిలికాన్ ఫోటోనిక్స్ రంగంలో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నీతి ఆయోగ్ సభ్యుడు డా. వీకే సారస్వత్ ఆదివారం డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ‘తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్’కు దశలవారీ వ్యూహాత్మక రోడ్‌మ్యాప్ రూపొందించడంపై ప్రధానంగా చర్చించారు. ఫోటోనిక్స్ వ్యాలీ కార్పొరేషన్ భవిష్యత్ కార్యాచరణతో పాటు, ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్–2.0’తో తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్‌ను అనుసంధానించే అవకాశాలపై సమీక్షించారు.

రాష్ట్రంలో పరిశోధన నుంచి వాణిజ్య స్థాయి తయారీ వరకు సమగ్ర సిలికాన్ ఫోటోనిక్స్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంపై సమావేశంలో అభిప్రాయాలు పంచుకున్నారు. డిజైన్, పరిశోధన, తయారీ, ప్యాకేజింగ్, టెస్టింగ్, సరఫరా వ్యవస్థలను ఒకే ఎకోసిస్టమ్‌లో అనుసంధానించే విధానాలపై చర్చించారు.
పరిశోధన ఫలితాలను వాణిజ్యపరమైన సాంకేతిక పరిష్కారాలు, ఉత్పత్తులుగా మలిచేందుకు పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.
అధునాతన ఫోటోనిక్స్‌కు తెలంగాణ కేంద్రంగా..
రాబోయే రోజుల్లో అధునాతన ఫోటోనిక్ ప్యాకేజింగ్, కో-ప్యాకేజ్డ్ ఆప్టిక్స్ వంటి తదుపరి తరం సాంకేతికతలకు తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఇందుకు అనుగుణంగా నిపుణులు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలతో కలిసి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
త్వరలో ఏర్పాటు చేయనున్న ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ క్వాంటం కంప్యూటింగ్’లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని డా. వీకే సారస్వత్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. ఫోటోనిక్స్, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అడ్వైజరీ కౌన్సిల్‌కు నాయకత్వం వహించాలని కూడా కోరారు.

ఈ సందర్భంగా డా. వీకే సారస్వత్ మాట్లాడుతూ.. ఫోటోనిక్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.
సమావేశంలో ఐటీఈ&సీ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, ఫోటోనిక్స్ వ్యాలీ కార్పొరేషన్ సీఈవో ఏఎస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply