తెలంగాణ–మారిషస్ ద్వైపాక్షిక సహకారంపై కీలక చర్చలు
హైదరాబాద్, ఆగస్టు 29 (అయుష్ 24 న్యూస్):
మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ మంత్రి లుచ్‌మనన్ పెంతియా శనివారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ–మారిషస్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు మంత్రులు ప్రధానంగా చర్చించారు. పరిపాలన, పర్యాటకం, ఐటీ/ఐటీఈఎస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, నైపుణ్యాభివృద్ధి, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలు, చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.

తెలంగాణ రాష్ట్రం తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని, తమ దేశం తెలంగాణను అత్యంత నమ్మకమైన భాగస్వామిగా పరిగణిస్తోందని మారిషస్ మంత్రి లుచ్‌మనన్ పెంతియా పేర్కొన్నారు.
మారిషస్ ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ఆధునిక పరిపాలనా విధానాలపై వారికి శిక్షణ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని ఆయన మంత్రి శ్రీధర్ బాబును కోరారు. అలాగే రాష్ట్రంలోని ఎంసీహెచ్‌ఆర్డీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ఇతర ప్రముఖ విద్యా సంస్థలతో కలిసి పనిచేసేందుకు మారిషస్ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని తెలిపారు.
అన్ని రంగాల్లోనూ మారిషస్‌కు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
డిసెంబర్ 7, 8 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న **“తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026”**లో పాల్గొనాలని మారిషస్ మంత్రి లుచ్‌మనన్ పెంతియాను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.

ఈ సమావేశంలో సెక్రటరీ ఫర్ పబ్లిక్ సర్వీస్ దేవేంద్ర గోపాల్, అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నోవేషన్ (ఏఐపీఎస్ఐ) బోర్డ్ ఛైర్‌పర్సన్ డాక్టర్ నికోలస్ రాగోడూ, ఏఐపీఎస్ఐ రిజిస్ట్రార్ డా. రమేష్ దుర్బరీ, ఎంఈఏ బ్రాంచ్ సెక్రటేరియట్ హెడ్ మాధవ్ ఆర్. సుల్ఫులే, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఐటీఈఅండ్‌సీ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.
📰 అయుష్ 24 న్యూస్
THE VOICE OF TRUTH










Leave a Reply