లంబాడీల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను సహించం: రమేష్ నాయక్ బాణోత్
కొత్తగూడెం | అయుష్ 24 న్యూస్
లంబాడీల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర మంత్రి సీతక్కను మంత్రి పదవి నుంచి తొలగించి, కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది రమేష్ నాయక్ బాణోత్ డిమాండ్ చేశారు.
కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లంబాడీ హక్కుల పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ నాయక్ బాణోత్ మాట్లాడుతూ.. ఇటీవల కొత్తగూడెం ప్రకాశం మైదానంలో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవ సాంస్కృతిక సభలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు లంబాడీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు.
ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లంబాడీల ఆత్మగౌరవం, హక్కులు, సంస్కృతికి భంగం కలిగించే విధంగా ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
దర్యాప్తు చేపట్టాలని డిమాండ్
మంత్రి సీతక్క ఆస్తులపై కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని రమేష్ నాయక్ బాణోత్ డిమాండ్ చేశారు. అలాగే ములుగు సమ్మక్క–సారక్క జాతరకు సంబంధించిన నిధుల వినియోగంపై విచారణ జరిపి, నిధుల ఖర్చుకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

భాష రాని కోయలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలి
లంబాడీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని రమేష్ నాయక్ బాణోత్ డిమాండ్ చేశారు.
అలాగే లంబాడీల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, హథీరాం బావాజీ, లంబాడీ జాతి, సంస్కృతి, పండుగలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మైపతి అరుణ్ కుమార్, చెంచు రామకృష్ణలపై సుమోటోగా కేసులు నమోదు చేయాలని కోరారు.
ఈ విషయాలపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. లంబాడీల ఆత్మగౌరవం, మనోభావాలను దెబ్బతీసే చర్యలు కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతామని రమేష్ నాయక్ బాణోత్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు భూక్య మంగీలాల్ నాయక్, జిల్లా కార్యదర్శి నరేష్ నాయక్, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు సక్రు నాయక్, గుగులోత్ రమేష్ నాయక్, గుగులోత్ శ్రీను నాయక్, నగేష్ నాయక్, సీతారామ్ నాయక్, తిరుపతి నాయక్, బాబులాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: పై వార్తలో పేర్కొన్న ఆరోపణలు, డిమాండ్లు లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకుల ప్రకటనల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply