ప్రజలు సరైన సమాచారం అందించి సర్వేకు సహకరించాలి: గుర్రం శ్రీనివాస్ గౌడ్
మంథని, సెప్టెంబర్ 9: జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS)-2026లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మంథని పట్టణంలో సర్వే నిర్వహిస్తున్నట్లు గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా మంథని ఆర్డీవో సురేష్, తహసీల్దార్ ఆరిఫోద్దిన్, ఎంపీడీవో శ్రీజ, మున్సిపల్ కమిషనర్ మనోహర్, మేనేజర్ శారదలను కలిసి సర్వేకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. సర్వే లక్ష్యాలు, ప్రాముఖ్యతను వారికి వివరించారు.
దేశంలో ఉపాధి, నిరుద్యోగం, కార్మిక శక్తి భాగస్వామ్యం, స్వయం ఉపాధి తదితర అంశాలకు సంబంధించిన విశ్వసనీయ గణాంకాలను రూపొందించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మొదటి దశలో ఎంపిక చేసిన కుటుంబాల సాధారణ వివరాలను నమోదు చేస్తామని, అనంతరం ఎంపికైన కుటుంబాలను మూడు నెలల పాటు ప్రతి నెలా ఒకసారి సందర్శించి మొబైల్ ట్యాబ్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు.
సర్వేలో కుటుంబ సభ్యుల విద్యార్హతలు, విద్యాభ్యాసం, వృత్తి విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధి, రోజువారీ కూలి పనులు, పని గంటలు, వేతన వివరాలు, మహిళల ఆదాయ వనరులు వంటి వివరాలను నమోదు చేస్తామని చెప్పారు.
అదేవిధంగా జొమాటో, స్విగ్గీ, రాపిడో, ఓలా, ఉబెర్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పనిచేస్తున్న గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికుల వివరాలను కూడా సేకరిస్తామని తెలిపారు.
సర్వే ద్వారా సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, గణాంకాల రూపకల్పనకు మాత్రమే వినియోగిస్తామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి సందేహాలకు తావులేకుండా సరైన సమాచారాన్ని అందించి సర్వే విజయవంతానికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంథని డివైఎస్‌ఓ వెంకటేశ్వర్లు, మంథని ఎంపీఎస్‌ఓ సంధ్యారాణి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్









Leave a Reply