మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్షలో కీలక ప్రకటన
మంథని, ఆగస్టు 19 — అయుష్ 24 న్యూస్:మంథని నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోందని, గత రెండున్నరేళ్లలో సుమారు రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించామని, ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.మంథనిలోని గంగాపురి వద్ద రూ.20 కోట్లతో NAC స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, మంథని–రామగుండం నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులకు రూ.21 కోట్లు, ఇతర ఆర్‌అండ్‌బీ రహదారి పనులకు రూ.97 కోట్లు, మంథని పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రూ.15 కోట్లతో బీటీ రోడ్లు, రూ.9 కోట్లతో అంతర్గత సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌తో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు.మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో నాలుగు మండలాల లబ్ధిదారులకు రేషన్ (స్మార్ట్) కార్డులు, కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, మైనార్టీలకు కుట్టుమిషన్లు, మహిళా స్వశక్తి సంఘాలకు చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు.

రోడ్ల అభివృద్ధిపై ప్రతి 15 రోజులకు సమీక్ష
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన మహనీయుడు పీవీ నరసింహారావు, అజాతశత్రువు దుద్దుల శ్రీపాదరావు ప్రాతినిధ్యం వహించిన మంథని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం తన అదృష్టమని తెలిపారు. తన సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆహ్వానం మేరకు మంథనికి రావడం సంతోషంగా ఉందన్నారు.మంథని నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి రూ.800 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామని, నల్గొండలో కూడా ఇంత భారీగా నిధులు మంజూరు కాలేదని తెలిపారు. గోదావరి నదిపై హై లెవల్ బ్రిడ్జికి రూ.125 కోట్లు, బైపాస్ రహదారికి రూ.162 కోట్లు, HAM రహదారులకు రూ.203 కోట్లు, మంథని–ఓడేడు రహదారికి రూ.60 కోట్లు తదితర పనులకు నిధులు మంజూరు చేశామని చెప్పారు.మంథని నియోజకవర్గంలోని అన్ని రహదారి పనులను 18 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి 15 రోజులకు సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ప్రజలందరికీ డబుల్ రోడ్డు సౌకర్యం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.కమాన్‌పూర్ నుంచి మంథని మున్సిపాలిటీ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి సుమారు రూ.200 కోట్లు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తీసుకుని వచ్చే 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు.గంగాపురి వద్ద నిర్మిస్తున్న NAC స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను మహిళలు, యువతకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆరు నుంచి ఎనిమిది నెలల్లో కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తామని చెప్పారు.ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాదని, ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందేందుకు యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి కూడా సుమారు రూ.200 కోట్ల పనులకు నిధులు మంజూరు చేశామని తెలిపారు.రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధితో పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పేరును SIR ముసాయిదా జాబితాలో పరిశీలించుకోవాలని, ప్రతి ఓటు ముఖ్యమైనదేనని సూచించారు.

తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కష్టకాలంలో కూడా మంథని ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉన్నారని తెలిపారు. రూ.800 కోట్ల నిధులు కూడా తక్కువేనని అన్నారు. శ్రీధర్‌బాబు ప్రతిభావంతుడని, మంథని అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు.రైతులు, మహిళలు, చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, రైతు భరోసా కింద భారీ నిధులు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

శ్రీధర్‌బాబు వ్యాఖ్యలు

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మంథని అభివృద్ధికి గత రెండున్నరేళ్లలో రూ.800 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మానేరు నదిపై వంతెన, రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పెంపు, రేషన్ కార్డుల జారీ వంటి పథకాలు అమలులో ఉన్నాయని వివరించారు. మంథనిలో పరిశ్రమలు, స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.NAC స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు రూ.20 కోట్లు కేటాయించామని, ఎనిమిది నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. రైతులు నీటి పొదుపు పాటించాలని, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు.
ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యలు

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ గతంలో అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.మణుగూరు–రామగుండం రైల్వే లైన్‌కు రూ.4 వేల కోట్ల నిధులు మంజూరయ్యాయని, జిల్లాలో ఇతర అభివృద్ధి పనులకు కూడా నిధులు తీసుకువచ్చామని తెలిపారు.అనంతరం మైదుపల్లి, ఎగ్లాస్పూర్, గుంజపడుగు, అడవి సోమనపల్లి, కేశనపల్లి, మచ్చుపేట, సుందిళ్ల, కమాన్‌పూర్, అంతర్గాం మండలం (కన్నాల) గ్రామాలకు సంబంధించిన వైకుంఠ రథాలను మంత్రులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మంథని మున్సిపల్ చైర్మన్ వి. శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి, రామగుండం మేయర్ ఎం. స్వామి, డిప్యూటీ మేయర్ పారుపల్లి ఎల్లయ్య, విద్యుత్ శాఖ సలహాదారు కాచే శశిభూషణ్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.











Leave a Reply