కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ధర్నా
హనుమకొండ, ఆగస్టు 17: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచేందుకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పథకాల అమలులో నిర్లక్ష్యం చేస్తూ అర్హులైన లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.
“పేదింటి ఆడబిడ్డల సంక్షేమంతో ఆటలాడటం సరికాదు. ఇచ్చిన హామీలను అమలు చేయాలి. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించి అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలి” అని డిమాండ్ చేశారు.

అర్హులైన లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని, పథకాల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply