తాడ్వాయి–పస్రా మధ్య కారును ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి
ములుగు జిల్లా | అయుష్ 24 న్యూస్
ములుగు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారిణి (DMO) K. సురేఖ దుర్మరణం చెందారు. తాడ్వాయి–పస్రా మధ్య ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ బలంగా ఢీకొట్టినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసం కావడంతో సురేఖతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

సురేఖ కుటుంబంలో ఇప్పటికే భర్త, కుమారుడి మరణాలతో విషాదం నెలకొనగా, తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె కూడా మృతి చెందడం కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చింది.
సురేఖ గతంలో మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ అధికారిణిగా కూడా విధులు నిర్వహించారు. విధి నిర్వహణలో ఆమె అందించిన సేవలను అధికారులు, సిబ్బంది గుర్తుచేసుకున్నారు.
సురేఖ ఆకస్మిక మృతిపట్ల వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు, సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply