- వడ్డెర సంఘం దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు ఇరగదిండ్ల కృష్ణ డిమాండ్
అయుష్ 24 న్యూస్, దేవరకొండ: ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర వెనుకబాటుతనానికి గురైన వడ్డెర కులస్తులను తక్షణమే ఎస్టీ జాబితాలో చేర్చాలని నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షుడు ఇరగదిండ్ల కృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా వడ్డెర కులస్తులు తీవ్ర పేదరికంలో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాళ్లు కొట్టడం, కంకర పనులు చేయడం, ప్రాజెక్టుల్లో కఠినమైన కూలీ పనులు చేసుకోవడం తప్ప తమకు సరైన భూములు, ఆస్తులు లేవని తెలిపారు. రోజువారీ కూలీ పనులకు వెళ్తేనే కుటుంబాలను పోషించుకునే దయనీయ పరిస్థితుల్లో వడ్డెరలు జీవిస్తున్నారని పేర్కొన్నారు.ఉపాధి లేక యువత ఆత్మహత్యలువడ్డెర కులంలో కేవలం కొద్దిమంది మాత్రమే ఉన్నత విద్యను అభ్యసించగలుగుతున్నారని కృష్ణ తెలిపారు. తల్లిదండ్రులు తీవ్రంగా శ్రమించి పిల్లలను చదివించినప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన రిజర్వేషన్లు లేక అనేకమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన గుర్తింపు, ఉపాధి అవకాశాలు లేక తీవ్ర మనోవేదనకు గురై పలువురు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు.ఎన్నికల హామీలను అమలు చేయాలిగతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనల సందర్భంగా వడ్డెరల సమస్యలను గుర్తించి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కృష్ణ పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశంపై హామీలు ఇచ్చారని తెలిపారు. అయితే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా ఆ హామీ అమలుకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు.అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేయాలితెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్లు నేతృత్వంలో గత తొమ్మిదేళ్లుగా మంత్రులు, ప్రజాప్రతినిధులను కలిసి అనేక వినతిపత్రాలు సమర్పించడంతో పాటు ధర్నాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వాల నుంచి సరైన స్పందన రాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి, వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ఇరగదిండ్ల కృష్ణ డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం విస్మరిస్తే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.










Leave a Reply