‘శక్తి’ స్కీమ్, జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలి: బీఆర్‌ఎస్‌వీ నేత బొడ్డుపల్లి కృష్ణ
దేవరకొండ, ఆగస్టు 20 — అయుష్ 24 న్యూస్:
‘శక్తి’ స్కీమ్, జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యను ‘శక్తి’ (స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్) విభాగంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను పీపీపీ విధానంలోకి తీసుకెళ్లడం వల్ల ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని బొడ్డుపల్లి కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందాల్సిన సాంకేతిక విద్యలో ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగితే భవిష్యత్తులో ఫీజుల భారం పెరిగే అవకాశం ఉందన్నారు. దీనివల్ల పేద విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులను ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వైపు నెట్టడం సరికాదన్నారు.
గతంలో పాలిటెక్నిక్ విద్య పూర్తిచేసిన విద్యార్థులకు నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించే లెటరల్ ఎంట్రీ అవకాశం ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం తీసుకుంటున్న విలీన నిర్ణయాల వల్ల ఈ సదుపాయానికి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని, తద్వారా విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు అదనపు సమయం, ఆర్థిక భారాన్ని భరించాల్సి రావచ్చని తెలిపారు.
విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచాల్సిన ప్రభుత్వం, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే విద్యా వ్యవస్థను బలోపేతం చేయకుండా బలహీనపరిచే నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, నాణ్యమైన బోధన, ఉపాధి అవకాశాలను మరింత పెంచాలని డిమాండ్ చేశారు.
గతంలో విజయవంతంగా అమలైన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నిలిపివేస్తూ విద్యార్థుల ఆశలను అడియాశలు చేయడం సరికాదని బొడ్డుపల్లి కృష్ణ అన్నారు. ఇప్పటికే గురుకుల విద్యా వ్యవస్థపై నిర్లక్ష్యం చూపుతున్న ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నత విద్యపై కూడా ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటే పేద విద్యార్థులు చదువును మధ్యలోనే వదిలే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ‘శక్తి’ స్కీమ్, జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని బీఆర్‌ఎస్‌వీ తరఫున బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply