నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలి: మంథని పోలీసులు
మంథని, సెప్టెంబర్ 10 (అయుష్ 24 న్యూస్): గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బుద్దే స్వామి సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంథని మండలానికి చెందిన సంబంధిత అధికారులు, గణపతి మండపాల నిర్వాహకులతో గురువారం మంథని పోలీస్ స్టేషన్ ఆవరణలో సమన్వయ సమావేశం నిర్వహించారు. సీఐ బి. స్వామి, ఎస్ఐ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సందర్భంగా సీఐ బుద్దే స్వామి మాట్లాడుతూ.. గణపతి మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి తొమ్మిది రోజుల ఉత్సవాలు, ఊరేగింపు, నిమజ్జనం వరకు నిర్వాహకులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందే సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు, ఎన్ఓసీలు పొందాలని సూచించారు. ప్రతి మండప నిర్వాహకుడు కమిటీ సభ్యుల వివరాలు, బాధ్యత వహించే వ్యక్తుల మొబైల్ నంబర్లు, మండపం ఏర్పాటు చేసే ప్రదేశ వివరాలను పోలీసులకు అందజేయాలని తెలిపారు.
ఉత్సవాల పేరుతో ప్రజలు, వ్యాపారులు, దుకాణదారులు, వాహనదారులు లేదా ఇతరులపై ఎలాంటి బలవంతం, బెదిరింపు, ఒత్తిడి తీసుకురాకుండా స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలను మాత్రమే స్వీకరించాలని సూచించారు.
మంథని ఎస్ఐ సందీప్ కుమార్ మాట్లాడుతూ.. ట్రాఫిక్కు అంతరాయం కలిగించే విధంగా మండపాలను ఏర్పాటు చేయరాదన్నారు. అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వంటి అత్యవసర వాహనాలకు మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరోధించకూడదని తెలిపారు.
మండపాలను సురక్షితంగా నిర్మించడంతో పాటు విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లను విద్యుత్ శాఖ అధికారుల అనుమతితో, అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్ల ద్వారా మాత్రమే ఏర్పాటు చేయాలని తెలిపారు.
అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఇతర భద్రతా పరికరాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రధాన మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చూడాలని అన్నారు.
ఉత్సవాల సందర్భంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు, ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మైకులు వినియోగించరాదని నిర్వాహకులకు సూచించారు.









Leave a Reply