ఉత్కంఠకు తెరదించిన రక్షాబంధన్ వేడుకలు
సీఎం నివాసంలో సీతక్కతో కలిసి రాఖీ కట్టిన కొండా సురేఖ
హైదరాబాద్, ఆగస్టు 28 — అయుష్ 24 న్యూస్
తెలంగాణ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ మధ్య రక్షాబంధన్ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో పాటు మంత్రి సీతక్క కూడా ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు.
పరకాల నియోజకవర్గ రాజకీయాలు, కొండా కుటుంబం–కాంగ్రెస్ నాయకత్వం మధ్య విభేదాలపై గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొండా సురేఖ సీఎం నివాసానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల కొండా సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవిపై కూడా పలు ఊహాగానాలు వినిపించాయి. కొండా దంపతుల రాజకీయ భవిష్యత్తుపై సైతం వివిధ రకాల ప్రచారాలు కొనసాగాయి.
అయితే రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి చేరుకున్న కొండా సురేఖ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి స్వయంగా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రాఖీ వేడుకల అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కొండా సురేఖ–రేవంత్‌రెడ్డి భేటీ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చకు దారితీసింది.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply