పిల్లలకు తమ మూలాలను తెలియజేసేందుకు ప్రత్యేకంగా సెట్ వేసిన యువ నర్సరీ రైతు శేషు
కడియం: నాలుగు డబ్బులు సంపాదించగానే నేల మీద నిలబడకుండా మిడిసిపడే రోజుల్లో.. తమ మూలాలను, పూర్వీకుల కష్టాలను మర్చిపోకుండా తర్వాతి తరాలకు తెలియజేస్తున్న కుటుంబాలు అరుదుగా కనిపిస్తుంటాయి. తాత సోడా కొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషించారని గర్వంగా చెప్పుకోవడమే కాకుండా, ఆ గతాన్ని పిల్లలకు కళ్లకు కట్టినట్లు చూపించేందుకు ఏకంగా ఓ సెట్ వేసిన కడియం నర్సరీ రైతు శేషు ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు.
తూర్పుగోదావరి జిల్లా కడియపులంకకు చెందిన మార్గాని శేషయ్య ఒకప్పుడు సోడా కొట్టు నిర్వహిస్తూ జీవనం సాగించేవారు. అదే సోడా కొట్టు ద్వారా వచ్చిన ఆదాయంతో నలుగురు కుమారులు, ఒక కుమార్తెను పెంచి పోషించారు. కాలక్రమంలో ఆయన కుమారులు నర్సరీ రంగంలోకి ప్రవేశించి మంచి స్థాయికి ఎదిగారు. నేడు నర్సరీ రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు దేవాలయాలకు విరాళాలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవలోనూ ముందుంటున్నారు. అయితే తమ గతాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు.
శేషయ్య పది పైసలకు గోలీ సోడా విక్రయిస్తూ ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన పెద్ద కుమారుడు, మాజీ ఎంపీపీ, ప్రస్తుతం ఏపీఐఐసీ డైరెక్టర్‌గా ఉన్న మార్గాని సత్యనారాయణ కాగా, రెండో, మూడో కుమారులు ఏడుకొండలు, గోవిందులు నర్సరీ రైతులుగా గుర్తింపు పొందారు. చివరి కుమారుడు మార్గాని వీరబాబు నర్సరీ రంగంలో దేశవిదేశాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు.
వీరబాబు ప్రపంచంలోని అనేక దేశాలను సందర్శించి కొత్త రకాల మొక్కలను కడియం నర్సరీ రంగానికి పరిచయం చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన కుమార్తె గౌతమి మచిలీపట్నం మాజీ ఎంపీ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ కోడలు.
తాత కష్టాన్ని పిల్లలకు చూపించేందుకు..
వీరబాబు, సత్య కుమారుడు శేషు కూడా నర్సరీ రంగంలో యువ రైతుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రకృతి ప్రేమికుడిగా పేరుపొందిన ఆయన పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాల ద్వారా పలువురు ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నారు.
తన తాతయ్య శేషయ్య జీవితాన్ని, ఆయన సోడా కొట్టు ద్వారా కుటుంబాన్ని పోషించిన తీరును తండ్రి ద్వారా తెలుసుకున్న శేషు.. ఆ విషయాలను ఎప్పటికీ మర్చిపోలేదు. తన చిన్నారులకు కూడా కుటుంబం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియజేయాలనే ఉద్దేశంతో శేషయ్య సోడా కొట్టు ఎలా ఉండేదో ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ఓ సెట్‌ను ఏర్పాటు చేశారు.
ఓ చిన్న పూరి గుడిసె.. అందులో సోడా కొట్టు.. అప్పట్లో శేషయ్య జీవనం సాగించిన తీరును కళ్లకు కట్టినట్లు ఆ సెట్లో రూపొందించారు. “మా మూలాలు ఇవి.. మా తాతయ్య ఇక్కడి నుంచే కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లారు” అంటూ పిల్లలకు వివరించడం పలువురిని ఆకట్టుకుంటోంది.
ప్రస్తుత తరంలో ఆర్థికంగా ఎదిగిన తర్వాత తమ గతాన్ని దాచిపెట్టేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటే.. శేషు మాత్రం తన కుటుంబం ఎదుర్కొన్న పేదరికాన్ని, తాతయ్య చేసిన కష్టాన్ని గర్వంగా భావిస్తూ పిల్లలకు తెలియజేయడం ఆదర్శంగా నిలుస్తోంది.
ప్రకృతి ప్రేమికుడిగా ప్రత్యేక గుర్తింపు
యువ నర్సరీ రైతు శేషు ప్రకృతి ప్రేమికుడిగానూ గుర్తింపు పొందారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాను పలుమార్లు కలుసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ రంగంలో చేసిన కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలతోనూ పరిచయాలు పెంచుకున్నారని తెలిపారు.
తమ మూలాలను మర్చిపోకుండా.. తాతయ్య కష్టాన్ని తర్వాతి తరాలకు పరిచయం చేస్తూ.. అదే సమయంలో ప్రకృతి పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్న శేషు తీరు పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
అయుష్ 24 న్యూస్










Leave a Reply