బీఆర్ఎస్ నేతల ఆరోపణలు నిరాధారమైనవని ఎమ్మెల్యే విమర్శ
ఇల్లందు, సెప్టెంబర్ 15 – అయుష్ 24 న్యూస్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే కోరం కనకయ్య తీవ్రంగా ఖండించారు. ఇల్లందులోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ, కేవలం రూ.1 జీతం తీసుకుంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ నాయకులకే చెల్లిందని విమర్శించారు.
ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఫాంహౌస్లో జీవితం గడిపిన మాజీ సీఎం కేసీఆర్తో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పోలిక ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో అనేక లోపాలు ఉన్నాయని, దాని కారణంగా ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.
ధరణికి బదులుగా భూ భారతి వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల భూములు, ఆస్తుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. భూ భారతి అమలుతో ప్రజలకు మెరుగైన భూ సేవలు అందించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
🔹 22-ఏ అంశంపై స్పష్టత ఇవ్వాలి
22-ఏ నిబంధన కొత్తగా ప్రజా ప్రభుత్వంలో తీసుకువచ్చింది కాదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచే కొనసాగుతోందని ఎమ్మెల్యే అన్నారు. 22-ఏకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
🔹 మాక్ అసెంబ్లీపై ఎమ్మెల్యే విమర్శలు
ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సి ఉండగా, మాక్ అసెంబ్లీ పేరుతో ప్రత్యేకంగా సభ నిర్వహించడం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసే విధంగా ఉందని కోరం కనకయ్య విమర్శించారు.
ఈ అంశంపై ప్రభుత్వం, స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
🔹 ఆరు గ్యారెంటీల అమలుపై ప్రస్తావన
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు.
పేదల కోసం ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, మహిళా సంఘాలకు బస్సులు తదితర కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం పునాది వేసిందని తెలిపారు.
గత పదేళ్లలో కులాల వారీగా లోన్లు ఇస్తామని చెప్పి ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని కోరం కనకయ్య ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు వాటిని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.
– అయుష్ 24 న్యూస్










Leave a Reply