కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు పెట్రోలింగ్ వాహనం చోరీకి గురైన ఘటన కలకలం రేపింది. గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు పోలీస్ వాహనాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం.
వాహనం కనిపించకుండా పోవడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సదరు యువకుడు వాహనాన్ని ర్యాష్‌గా నడుపుతూ ఎల్కతుర్తి సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
అనంతరం పోలీస్ క్యాప్ ధరించి రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. యువకుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఎల్కతుర్తి పోలీసులు కరీంనగర్ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు.
అప్పటికే పోలీస్ వాహనం మిస్సింగ్‌పై కరీంనగర్ పోలీసులు గాలింపు చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎల్కతుర్తి పోలీసులు వాహనంతో పాటు యువకుడిని కరీంనగర్‌కు తరలించినట్లు సమాచారం.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి పూర్తి వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
– అయుష్ 24 న్యూస్ ప్రతినిధి, కరీంనగర్









Leave a Reply