మండపాలు, విగ్రహాలు, నిమజ్జనం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా
పెద్దపల్లి, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): ఈనెల 14న వినాయక చవితి సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలను ప్రతిష్ఠించే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి పొందాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ శాఖ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలని సీపీ సూచించారు. మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, సంబంధిత పోలీస్ స్టేషన్, విగ్రహం మరియు మండపం ఎత్తు, ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, ప్రతిష్ఠాపన తేదీ తదితర వివరాలను నమోదు చేయాలని పేర్కొన్నారు.
అదేవిధంగా గణేష్ నిమజ్జనం తేదీ, సమయం, ప్రదేశం, నిమజ్జనానికి ఉపయోగించే వాహనం వివరాలను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు.
ప్రజలు, భక్తులు భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలని సీపీ కోరారు. మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించాలని సూచించారు.









Leave a Reply