— ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ పిలుపు
— గోడపత్రికను ఆవిష్కరించిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు
హైదరాబాద్, ఆగస్టు 30: గిరిజన హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. ధర్మ నాయక్, ఆర్. శ్రీరాం నాయక్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 6న జాతీయ పోరాట సదస్సు, సెప్టెంబర్ 7న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మంది ఆదివాసి గిరిజనులతో మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాలకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్, మాజీ రాజ్యసభ సభ్యురాలు, ఆర్మ్ జాతీయ నాయకురాలు బృందా కారత్, త్రిపుర మాజీ మంత్రి, ఆర్మ్ జాతీయ ఛైర్మన్ జితేంద్ర చౌదరి, బెంగాల్ మాజీ పార్లమెంట్ సభ్యుడు పులిన్ బస్కీ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. దేశంలోని 16 రాష్ట్రాల నుంచి ఆదివాసి గిరిజనులు, ఉద్యమకారులు హాజరవుతారని, తెలంగాణ నుంచి సుమారు 100 మంది ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను నిర్వీర్యం చేసే విధంగా కొత్త చట్టాలను తీసుకొస్తోందని వారు ఆరోపించారు. రాజ్యాంగంలోని ఐదో, ఆరో షెడ్యూళ్ల ద్వారా భూమిపై ఆదివాసీలకు కల్పించిన హక్కులతో పాటు పేసా చట్టం, 1/70 చట్టం, జీఓ నంబర్ 3 వంటి రక్షణలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
అటవీ భూములపై గిరిజనులకు కల్పించాల్సిన హక్కులను పరిరక్షించే చట్టాలకు విఘాతం కలిగించే విధంగా అటవీ సంరక్షణ చట్టం–2023 తీసుకొచ్చారని వారు ఆరోపించారు. దీని వల్ల ఆదివాసీల హక్కులకు భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా కొత్త విధానాలను తీసుకురావడం ద్వారా కోట్లాది మంది ఆదివాసి గిరిజనుల ఉపాధి హక్కులపై ప్రభావం పడుతోందని అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, విద్యార్థులకు సంబంధిత తరగతుల్లో సీట్లు కేటాయించలేని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. దీంతో గిరిజన విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివాసి గిరిజనుల్లో నిరుద్యోగం గణనీయంగా పెరిగిందని, ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లలో తీవ్ర వివక్ష ఎదురవుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని, వాటిని జనరల్ కేటగిరీకి మార్చడం ద్వారా గిరిజనులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు.
గిరిజన తెగలు మాట్లాడే భాషలను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. గిరిజనుల భూమి, విద్య, ఉపాధి, రాజ్యాంగ హక్కులు, భాష తదితర సమస్యలపై సెప్టెంబర్ 6, 7 తేదీల్లో జరిగే సదస్సు, మహా ధర్నాలో విస్తృతంగా చర్చించి దేశవ్యాప్త ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. బాలు నాయక్, నగర అధ్యక్షులు వి. రాంకుమార్, ఎస్. కిషన్, రంగారెడ్డి జిల్లా నాయకులు ఎం. గోపినాయక్ తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply