నేటి యువతకు అరవింద్, రాజశేఖర్‌లు ఆదర్శం: మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని, ఆగస్టు 24, అయుష్ 24 న్యూస్: పదకొండు రోజుల క్రితం మంథని పట్టణంలోని బొక్కలవాగులో మునిగిపోతున్న బాలికను రక్షించిన బోయిన్‌పేటకు చెందిన ఇద్దరు యువకుల సాహసం అభినందనీయమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.
సోమవారం మంథని పట్టణంలోని రాజగృహాలో బోయిన్‌పేటకు చెందిన అంకం రాజశేఖర్, ఆకుల అరవింద్‌లను శాలువాతో సన్మానించి పుట్ట మధూకర్ అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోయిన్‌పేటకు చెందిన పర్శవేన రాజు యాదవ్ అలియాస్ ఆర్‌కే యాదవ్ గొర్రెలను మేపుకుంటూ బొక్కలవాగు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో మునిగిపోయారని తెలిపారు. తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన ఆయన కుమార్తె కూడా నీటిలో మునిగిపోయిందని వివరించారు.
బాలిక నీటిలో మునిగిపోతూ కేకలు వేయడంతో సమీపంలోని గోదాంలో పనికి వెళ్తున్న అంకం రాజశేఖర్, ఆకుల అరవింద్‌లు వెంటనే స్పందించారని తెలిపారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వాగులోకి దూకి బాలికను రక్షించారని కొనియాడారు.
బాలిక ప్రాణాలను కాపాడేందుకు ఇద్దరు యువకులు చూపిన ధైర్యసాహసం ఎంతో గొప్పదని పుట్ట మధూకర్ అన్నారు. నేటి యువతలో కొందరు చెడు మార్గాల వైపు పయనిస్తున్న సమయంలో, రాజశేఖర్, అరవింద్‌లు తమ సాహసంతో మానవత్వానికి ప్రతీకగా నిలిచి యువతకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఈత నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అత్యవసర సమయాల్లో ఈత నైపుణ్యం ఎంతో విలువైనదని, ప్రమాదాల్లో పలువురి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు.
అనంతరం పుట్ట మధూకర్ సాహసవంతులైన యువకులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా యువకుల ధైర్యసాహసాలను పలువురు అభినందించారు.
అయుష్ 24 న్యూస్
నిజం మా ధ్యేయం… ప్రజలే మా బలం…










Leave a Reply