బీసీలు రాజకీయంగా ఏకం కావాలి: రాపోలు జగన్
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (అయుష్ 24 న్యూస్): బీసీలకు రాజకీయ ప్రాధాన్యం, పాలనలో తగిన వాటా కల్పించాలనే అంశంపై రాపోలు జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివిధ రాజకీయ పార్టీల్లో బీసీలను కేవలం అవసరానికి ఉపయోగించుకుని పక్కన పెడుతున్నారంటూ విమర్శించారు.
“కూరల్లో కరివేపాకులా బీసీలను వాడుకుని విసిరేస్తున్నారు. మనం కరివేపాకులం కాదు.. కూరలం. తీసేసే ఆకులం కాదు.. వండే చేతులం” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వివిధ రాజకీయ పార్టీల కోసం బీసీలు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ, అధికారంలో మాత్రం తగిన స్థానం దక్కడం లేదని అన్నారు.
ఉద్యమాలు, పోరాటాల్లో బీసీలు ముందుండి పాల్గొంటున్నారని, అయితే రాజకీయ అధికారంలో మాత్రం వారి జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం లభించడం లేదని రాపోలు జగన్ పేర్కొన్నారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు పాలనలో సముచిత భాగస్వామ్యం ఉండాలని డిమాండ్ చేశారు.

“ఓ బీసీ సోదరా.. కళ్లుతెరువు” అంటూ బీసీలకు ఆయన పిలుపునిచ్చారు. అగ్రాధిపత్య రాజకీయ పార్టీలపై ఆధారపడకుండా బీసీలు తమ రాజకీయ భవిష్యత్తుపై స్వయంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
బీసీల హక్కులు, భవిష్యత్తు కోసం ఐక్యంగా ఉద్యమించాలని, తమ రాజకీయ శక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. “మన జెండా–బీసీ జెండా, మన వాదం–బీసీ వాదం, మన నినాదం–బీసీ రాజ్యం” అంటూ తన సందేశాన్ని ముగించారు.









Leave a Reply