గేట్స్ ఫౌండేషన్ సాంకేతికతతో నెట్‌జీరో టాయిలెట్లు.. లుంబినీ పార్కులో తొలి యూనిట్ల ఏర్పాటు
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం మరో ఆధునిక సాంకేతికతకు వేదికగా మారింది. బిల్ గేట్స్ ఫౌండేషన్ అభివృద్ధి చేసిన నీటి పునర్వినియోగ సాంకేతికత ఆధారంగా రూపొందించిన నెట్‌జీరో, గ్రీన్ టాయిలెట్లను నగరంలో ఉత్పత్తి చేయనున్నారు.
పర్యావరణ అనుకూల సాంకేతిక సంస్థ రీ ఫ్లో, తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టీ-వర్క్స్, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అత్యాధునిక గ్రీన్ టాయిలెట్లను తయారు చేసి దేశంలోని వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాలకు సరఫరా చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన గ్రీన్ టాయిలెట్లను హైదరాబాద్‌లోని లుంబినీ పార్కులో ఏర్పాటు చేశారు. నీటిని శుద్ధి చేసి పునర్వినియోగించుకునే నెట్‌జీరో టాయిలెట్ల సముదాయాన్ని ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
సుమారు రూ.కోటితో ఏర్పాటు చేసిన ఈ మరుగుదొడ్లను అవసరమైన ప్రాంతాలకు తరలించే విధంగా రూపొందించినట్లు తెలిపారు. రీ ఫ్లో సంస్థ టీ-వర్క్స్‌తో కలిసి ఈ టాయిలెట్లను హైదరాబాద్‌లోనే ఉత్పత్తి చేయాలని నిర్ణయించడం అభినందనీయమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
సోలార్ విద్యుత్‌తో పనిచేసే ఈ టాయిలెట్లకు ప్రత్యేక విద్యుత్ కనెక్షన్ అవసరం లేదని మంత్రి తెలిపారు. ఒకసారి ట్యాంకులో నీటిని నింపితే అదే నీటిని పలు దఫాలు శుద్ధి చేసి తిరిగి వినియోగించుకునే విధంగా సాంకేతికతను రూపొందించినట్లు వివరించారు.
ఈ సాంకేతికతను ఉచితంగా అందిస్తున్న గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులను శ్రీధర్ బాబు అభినందించారు. ఇప్పటికే 50 యూనిట్ల రీసైకిల్ టాయిలెట్లకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించారు.
గేట్స్ ఫౌండేషన్ పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన సాంకేతికత ఉచితంగా అందుబాటులోకి రావడంతో ఈ టాయిలెట్లను తక్కువ ధరకు అందించే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. తక్కువ నీటి వినియోగం, ప్రత్యేక విద్యుత్ కనెక్షన్ అవసరం లేకపోవడం వంటి లక్షణాల కారణంగా వీటిని వివిధ ప్రాంతాల్లో ఉపయోగించవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి అర్చనా వ్యాస్, రీ ఫ్లో ప్రతినిధి అభిషేక్, టీ-వర్క్స్ సీఈఓ జోగిందర్ తనికెళ్ల తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply