Breaking News
సైబర్ నేరాలపై అప్రమత్తతే రక్షణ – బోడు పోలీస్ స్టేషన్‌లో అవగాహన సదస్సు

బోడు, జూలై 27 (AYUSH24 NEWS): నేటి డిజిటల్ యుగంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవాలంటే అప్రమత్తతే ప్రధాన ఆయుధమని బోడు పోలీస్ స్టేషన్ ఎస్సై రాజమల్లు పేర్కొన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు సోమవారం బోడు పోలీస్ స్టేషన్‌లో సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై ఎం. రాజమౌలి మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, వాట్సాప్ లింకులు, బ్యాంకుల పేరుతో వచ్చే నకిలీ సందేశాలను నమ్మి స్పందిస్తే తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

ప్రభుత్వ అధికారులు, బ్యాంకు సిబ్బంది లేదా పోలీసుల పేర్లు చెప్పి ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకు ఖాతా వివరాలు అడిగే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు. అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓటీపీని ఇతరులతో పంచుకోవద్దని, ఫోన్‌లో చెప్పిన సూచనల మేరకు యాప్‌లు డౌన్‌లోడ్ చేయరాదని, తెలియని లింకులను క్లిక్ చేయకూడదని వివరించారు.

రైతులు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలి

రైతుబంధు, సబ్సిడీలు, రుణమాఫీ, ఇతర ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయంటూ పంపే నకిలీ మెస్సేజ్‌లను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. ఏవైనా అనుమానాస్పద కాల్స్ లేదా సందేశాలు వచ్చిన వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులను లేదా పోలీసులను సంప్రదించాలని కోరారు.

సోషల్ మీడియాలో జాగ్రత్తలు తప్పనిసరి

సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్, పాన్ వంటి కీలక సమాచారాన్ని పంచుకోవద్దని, బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించి వాటిని తరచూ మార్చుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ కొనుగోళ్లు, డబ్బు లావాదేవీలు నిర్వహించే సమయంలో అధికారిక వెబ్‌సైట్లు, విశ్వసనీయ యాప్‌లను మాత్రమే వినియోగించాలని తెలిపారు.

సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయండి

సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్కు ఫిర్యాదు చేయాలని, అలాగే సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని ఎస్సై సూచించారు. ప్రజల్లో అవగాహన పెరిగితేనే సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాలపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్సై నాగయ్య, హెడ్ కానిస్టేబుల్ ఖాదీర్, పోలీసు సిబ్బంది, గ్రామస్థులు, రైతులు, యువత పాల్గొని సైబర్ నేరాల నివారణకు సంబంధించిన పలు సూచనలు తెలుసుకున్నారు.

— AYUSH24 NEWS

“The Voice of Truth”

Your Attractive Heading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *