పల్లవి మోడల్ స్కూల్‌లో ఇంటర్ స్కూల్ కరాటే పోటీలు ఘనంగా నిర్వహణ
హైదరాబాద్, జూలై 26 (అయుష్ 24 న్యూస్): హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఉన్న పల్లవి మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేష్ గండ్రల్ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ కరాటే ఛాంపియన్‌షిప్ ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో హైదరాబాద్ నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ పోటీలను కాటా మరియు కుమిటే విభాగాల్లో నిర్వహించగా, ప్రతిభ కనబరిచిన విజేతలకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. పోటీలకు కరాటే ఆర్. మల్లికార్జున్ గౌడ్ ప్రధాన న్యాయనిర్ణేతగా వ్యవహరించగా, పలువురు రిఫరీలు, జడ్జీలు సమర్థవంతంగా పోటీలను నిర్వహించారు.

ఈ సందర్భంగా పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేష్ గండ్రల్ మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని తెలిపారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు చదువులోనూ రాణించడంతో పాటు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటారని అన్నారు. ముఖ్యంగా కరాటే క్రమశిక్షణ, ఆత్మరక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఉత్తమ యుద్ధకళ అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సుసాన్ జాన్, పాఠశాల కరాటే కోచ్ డబ్ల్యూ. ఆనంద్, నగరంలోని వివిధ పాఠశాలల కరాటే కోచ్‌లు, రిఫరీలు, జడ్జీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్
“నిజం కోసం… ప్రజల గొంతుక”

