తోగూడెం అక్రమ మైనింగ్‌పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
సేవాలాల్ సేన ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి – జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 27: పాల్వంచ మండలం తోగూడెం గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై తక్షణమే సమగ్ర, స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సేవాలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ (IDOC)ను ముట్టడించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్, జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ, గతంలో 29-06-2026న ఇదే అంశంపై కలెక్టర్‌కు వినతిపత్రం అందించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
తోగూడెంలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని, గిరిజనుల హక్కులు ఉల్లంఘించబడటంతో పాటు సహజ వనరులు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలిపారు.

జిల్లా మైనింగ్ శాఖ అధికారులు తోగూడెం ప్రాంతంలోని క్వారీలను ఇప్పటికే మూడుసార్లు సీజ్ చేసినట్లు ప్రకటించడం ద్వారా అక్రమ మైనింగ్ జరిగిన విషయాన్ని పరోక్షంగా అంగీకరించినట్లేనని పేర్కొన్నారు. అయితే తాత్కాలికంగా మాత్రమే సీజ్ చేసి మళ్లీ అక్రమ తవ్వకాలకు అవకాశం కల్పించడం వెనుక ఉన్న కారణాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు.
అక్రమంగా తవ్విన ఖనిజ పరిమాణాన్ని తక్కువగా నమోదు చేసి ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని తగ్గించడం ద్వారా ప్రజాధనానికి భారీ నష్టం కలిగించారని ఆరోపించారు. అలాగే సమాచార హక్కు చట్టం (RTI) కింద కోరిన వివరాల్లో వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు సమాచారం అందించారని ఆరోపిస్తూ దీనిపై కూడా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పర్యావరణ అనుమతులు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) మార్గదర్శకాలు మరియు ఇతర చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమ మైనింగ్ కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
అక్రమ మైనింగ్ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపి సంబంధిత మైనింగ్ శాఖ అధికారుల పాత్రను కూడా దర్యాప్తు చేయాలని, అక్రమ మైనింగ్ నిర్వహించిన వారితో పాటు సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, ఉపాధ్యక్షులు బోడ రమేష్ నాయక్, అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్, జిల్లా కార్యదర్శి బాదావత్ సురేష్ నాయక్, ప్రచార కార్యదర్శి జరపల లాలు నాయక్, బట్టు హుస్సేన్ నాయక్, గోర్ బంజారా పోరాట సమితి నాయకులు, గిరిజన ప్రతినిధులు, మహిళలు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
— AYUSH24 NEWS












