Breaking News
సెప్టెంబర్ మొదటి వారంలోనే గోదావరి పుష్కరాల పనులు ప్రారంభించాలి

ఆగస్టు చివరి నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలి

నాణ్యతలో రాజీ వద్దు.. శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి

‘గోదావరి పుష్కరాలు–2027’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు

హైదరాబాద్, ఆయుష్ 24 న్యూస్:
‘గోదావరి పుష్కరాలు–2027’ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలో పుష్కరాల పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ‘గోదావరి పుష్కరాలు–2027’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు శాఖల వారీగా పుష్కరాల సన్నద్ధత, ఏర్పాట్ల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.

రూ.1,000 కోట్లతో పుష్కరాల ఏర్పాట్లు

గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే టైర్–1 ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.

నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పడంతో పాటు నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు.

రోజువారీగా పనుల పురోగతిపై పర్యవేక్షణ

పుష్కరాల పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు సంబంధిత అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి సూచించారు. పనుల పురోగతిని రోజువారీగా తెలుసుకునేలా ప్రత్యేక డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తీసుకురావాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.

అన్ని శాఖలు సమష్టిగా పనిచేస్తేనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించగలమని అన్నారు. శాఖల మధ్య సమన్వయంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.

రహదారుల అనుసంధానం పూర్తి చేయాలి

పుష్కరాలకు వచ్చే భక్తులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి రహదారిని అనుసంధానం చేయాలని మంత్రి ఆదేశించారు. ఎక్కడైనా రోడ్డు కనెక్టివిటీ లోపం ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకుని, అవసరమైతే స్థానిక నిధులతో పనులు చేపట్టాలని సూచించారు.

పుష్కరాల ఏర్పాట్లలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ఉన్నతాధికారులు, పండితులను తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలని అన్నారు. భక్తులకు సేవలు అందించేందుకు ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలను ముందుగానే గుర్తించాలని సూచించారు.

అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు అందించే సలహాలు, సూచనలను అధికారులు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను ఆయన హెచ్చరించారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు.

— AYUSH 24 NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *