Breaking News
దేవరకొండ చేనేత సహకార సంఘంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

చేనేత కార్మికులకు ఘన సన్మానం – కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు

దువ్వ వెంకటేశ్వర్ల కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహాయం ప్రకటించిన పద్మశాలి కులబాంధవులు

దేవరకొండ | AYUSH24 NEWS

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని చేనేత సహకార సంఘం భవనంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి చేనేత సహకార సంఘం చైర్మన్ చేరిపల్లి బాలరాజు అధ్యక్షత వహించగా, దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చేనేత రంగం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ కొత్త అవకాశాల వైపు అడుగులు వేస్తోందన్నారు. నేటి పరిస్థితుల్లో చేనేత వృత్తికి సాంకేతికతను జోడించి యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు చేనేత వృత్తిని చేరువ చేయాలని, ప్రతి సభ్యుడు చేనేత సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు రాయితీ రుణాలు, ప్రోత్సాహక పథకాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

ఈ సందర్భంగా పట్టణానికి చెందిన నలుగురు చేనేత కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

అనంతరం ఇటీవల అనారోగ్యంతో ఇంటికే పరిమితమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దువ్వ వెంకటేశ్వర్ల కుటుంబానికి పట్టణ పద్మశాలి కులబాంధవులు, మహిళలు కలిసి రూ.25 వేల ఆర్థిక సహాయం సేకరించి త్వరలో పూర్తి మొత్తాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పున్న వెంకటేశ్వర్లు, చేనేత సహకార సంఘం డైరెక్టర్లు గుర్రం విజయలక్ష్మి, రాపోలు భారతమ్మ, వనం శ్రీనివాసులు, చిలువేరు స్వామి నందీశ్వర్, పగిడిమర్రి శ్రీనివాసులు, ముసిని అంజన్, కౌన్సిలర్లు పులిజాల భవాని జానీ, గాజుల సావిత్రి మురళి, చిలువేరు చంద్రమౌళి, సిరిపోతు శ్రీరాములు, మసన మణిదీప్, గాజుల జనార్ధన్, వనం పుష్పలత, పగిడిమర్రి సత్యమూర్తి, ఇడం చంద్రమౌళి, పున్న భిక్షమయ్య, చేరిపల్లి జయలక్ష్మి, సంగిశెట్టి జ్యోత్స్నా తదితరులు పాల్గొన్నారు.

— AYUSH24 NEWS

ఒంటి కాలుతో విద్యాభ్యాసం… కృత్రిమ కాలు కోసం ఎదురుచూపులు

కమలాపూర్ విద్యార్థిని పల్లపు ఆకాంక్ష హృదయవిదారక జీవన పోరాటం

దేవరకొండ | AYUSH24 NEWS

“అంగవైకల్యం శరీరానికే… ఆత్మవిశ్వాసానికి కాదు” అనే మాటను నిజం చేస్తూ, ఒంటి కాలుతో తన చదువును కొనసాగిస్తూ జీవితంలో ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తోంది దేవరకొండ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన పల్లపు ఆకాంక్ష.

తొమ్మిది సంవత్సరాల వయస్సులో బోన్ క్యాన్సర్ బారిన పడిన ఆకాంక్షకు ఎడమ కాలును తొలగించాల్సి వచ్చింది. అప్పటి నుంచి కర్ర సాయంతోనే నడుస్తూ ఎన్నో కష్టాలను అధిగమిస్తూ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది.

పేద కుటుంబానికి చెందిన ముగ్గురు కుమార్తెల్లో ఆకాంక్ష రెండవ సంతానం. ప్రస్తుతం హైదరాబాద్‌లో డిగ్రీ రెండో సంవత్సరం (బి.కాం) చదువుతోంది. చదువులో ముందుకు వెళ్లి భవిష్యత్తులో బ్యాంకు ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాలనే గొప్ప లక్ష్యంతో కృషి చేస్తోంది.

అయితే ప్రతి రోజు కళాశాలకు వెళ్లడం, ప్రయాణాలు చేయడం, సాధారణ పనులు కూడా కర్ర సాయంతోనే చేయాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తనకు ఒక కృత్రిమ ఎడమ కాలు ఏర్పాటు చేసి సహాయం చేయాలని దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలను ఆకాంక్ష హృదయపూర్వకంగా వేడుకుంటోంది.

“నాకు ఒక కృత్రిమ కాలు లభిస్తే… నేను మరింత ఆత్మవిశ్వాసంతో చదువు పూర్తి చేసి, ఉద్యోగం సాధించి, నా కుటుంబానికి అండగా నిలుస్తాను” అని ఆకాంక్ష ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ యువతి జీవితంలో వెలుగు నింపేందుకు దాతృత్వ హృదయం కలిగిన వారు ముందుకు వచ్చి ఆమె ఆకాంక్షను నిజం చేయాలని AYUSH24 NEWS విజ్ఞప్తి చేస్తోంది.

– AYUSH24 NEWS

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన స్వర్ణకార సంఘం

దేవరకొండ | AYUSH24 NEWS

దేవరకొండ పట్టణంలోని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గురువారం స్వర్ణకార సంఘం భవనం వద్ద తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి వేడుకలను సంఘం అధ్యక్షులు సిరిగిద్దే విఠలాచార్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంఘం అధ్యక్షులు సిరిగిద్దే విఠలాచార్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ఆయన లేని లోటు తెలంగాణ సమాజానికి తీరనిదని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం సభ్యులు, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS