Breaking News
కొండమల్లేపల్లిలో అక్రమ నాటు సారా తయారీకి తరలిస్తున్న నల్ల బెల్లం స్వాధీనం

2,250 కిలోల నల్ల బెల్లం, 250 కిలోల పట్టికతో బొలెరో వాహనం సీజ్ – నాటు సారా తయారిపై కఠిన చర్యలు: ఎక్సైజ్ అధికారులు

AYUSH24 NEWS | కొండమల్లేపల్లి

కొండమల్లేపల్లి మండలంలో అక్రమంగా నాటు సారా తయారీకి వినియోగించే నల్ల బెల్లాన్ని తరలిస్తున్న వాహనాన్ని ఎక్సైజ్ అధికారులు సోమవారం పట్టుకున్నారు.

హైదరాబాద్ ఎక్సైజ్ విభాగం, దేవరకొండ ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో మండలంలోని ఆంబోతు తండా వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 2,250 కిలోల నల్ల బెల్లం, 250 కిలోల పట్టికను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

దీనితో పాటు బొలెరో వాహనాన్ని కూడా సీజ్ చేసినట్లు ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస్ తెలిపారు. నాటు సారా తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ దాడిలో ఎక్సైజ్ ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

– AYUSH24 NEWS | The Voice of Truth

మంథనిలో అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు వేగం – నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

సమీకృత ఆర్డీవో కార్యాలయం, 50 పడకల ఆసుపత్రి, మున్సిపల్ కార్యాలయ నిర్మాణాల పరిశీలన

బొక్కలవాగు చెక్‌డ్యాం ఆధునికరణకు భూమిపూజ – కోకాకోలా ఫ్యాక్టరీతో యువతకు ఉపాధి అవకాశాలు

AYUSH24 NEWS | మంథని

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సోమవారం పరిశీలించి, నిర్మాణ పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంత్రి సమీకృత ఆర్డీవో కార్యాలయం, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నూతన మున్సిపల్ కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించి వాటి పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం మంథని పట్టణంలోని బొక్కలవాగు చెక్‌డ్యాం ఆధునికరణ, కట్ట సుందరీకరణ పనులకు మంత్రి భూమిపూజ నిర్వహించారు. కోకాకోలా కంపెనీ సీఎస్‌ఆర్ నిధుల కింద రూ.2 కోట్లతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. చెక్‌డ్యాంలో పేరుకుపోయిన సిల్ట్ తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కట్టపై వాక్‌వే, చిన్నారుల పార్క్, పచ్చదనం వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

అదే రోజు రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ శివారులో ప్రతిపాదిత కోకాకోలా ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన సుమారు 250 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, కోకాకోలా సంస్థ ప్రతినిధులతో కలిసి మంత్రి పరిశీలించారు.

ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన భూమి, రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న మంత్రి, పారిశ్రామిక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అన్ని నిబంధనలను పాటిస్తూ తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

కోకాకోలా ఫ్యాక్టరీ ఏర్పాటుతో పెద్దపల్లి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతం లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS | The Voice of Truth

అజ్మాపురం నరసింహుల కుంటను కబ్జా నుంచి కాపాడాలి.. అధికారులను వేడుకుంటున్న రైతులు, మత్స్యకారులు

రాత్రికి రాత్రే హద్దురాళ్లు, మట్టి దిబ్బలు, సిమెంట్ పలకల నిర్మాణం.. సర్వే అనంతరం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్

AYUSH24 NEWS | పీఏ పల్లి

పీఏ పల్లి మండలంలోని అజ్మాపురం గ్రామ శివారులో ఉన్న నరసింహుల కుంట కబ్జాకు గురవుతోందని గ్రామ రైతులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాల సంరక్షణతో పాటు మత్స్యకారుల జీవనాధారంగా ఉన్న ఈ కుంటను కబ్జాదారుల నుంచి కాపాడాలని అధికారులను కోరుతున్నారు.

సోమవారం చెరువు చైర్మన్ గడియ బాలయ్యతో పాటు అంబటి సత్యనారాయణ, అంబటి కృష్ణయ్య, చింతకాయల సైదయ్య, అంబటి వెంకటేశం, అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ, కొంతమంది అక్రమార్కులు రాత్రికి రాత్రే కుంటను ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

కుంటలో హద్దురాళ్లు ఏర్పాటు చేయడంతో పాటు, భారీగా మట్టి పోసి, సిమెంట్ పలకల గోడను నిర్మించారని పేర్కొన్నారు. దీంతో చెరువు విస్తీర్ణం తగ్గిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల రైతులు, మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయమై AYUSH24 NEWS మండల తహసీల్దార్‌ను వివరణ కోరగా, ఈ అంశం తన దృష్టికి రాలేదని తెలిపారు. ప్రస్తుతం ఆన్‌లైన్ సర్వేలు కొనసాగుతున్నాయని, వారం రోజుల్లో నరసింహుల కుంటకు సర్వే నిర్వహించి, కబ్జా జరిగినట్లు తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గ్రామస్థులు, రైతులు, మత్స్యకారులు చెరువును వెంటనే రక్షించి, అక్రమ ఆక్రమణలను అడ్డుకోవాలని సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేశారు.

– AYUSH24 NEWS | The Voice of Truth

‘SPR’ పాఠశాల అక్రమాలపై జిల్లా అధికారులకు ప్రజా, విద్యార్థి సంఘాల ఉమ్మడి ఫిర్యాదు

అక్రమ అడ్మిషన్లు, అనుమతుల్లేని హాస్టల్, FTL పరిధిలో నిర్మాణంపై విచారణకు డిమాండ్

AYUSH24 NEWS | నల్లగొండ

కొండమల్లేపల్లిలోని ‘SPR’ (సర్వేపల్లి రాధాకృష్ణ) హైస్కూల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ కొనసాగుతోందని ఆరోపిస్తూ, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి (DEO), జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం ఉమ్మడిగా వినతిపత్రాలు సమర్పించారు.

రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ (RTISS) ఆధ్వర్యంలో TNSF, YSRSU, SHPS తదితర సంఘాల ప్రతినిధులు అధికారులను కలిసి పాఠశాల యాజమాన్యం చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ పలు ఆధారాలను సమర్పించారు.

ఈ సందర్భంగా RTISS ఫౌండర్ & నేషనల్ ప్రెసిడెంట్ కేతావత్ బాబురామ్ నాయక్, TNSF దేవరకొండ ఇన్‌చార్జ్ జార్పుల జగన్ నాయక్, YSRSU జిల్లా అధ్యక్షుడు ఎండి. సిరాజ్, SHPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. రమేష్ నాయక్ మాట్లాడుతూ, RJDSE హైదరాబాద్ ప్రొసీడింగ్స్ ప్రకారం ‘SPR’ పేరును వినియోగించరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ యాజమాన్యం వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అలాగే G.O.Ms.No.1 ప్రకారం అధికారిక అనుమతి వచ్చే వరకు తరగతులు నిర్వహించడం, కొత్త అడ్మిషన్లు చేపట్టడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

ప్రధాన డిమాండ్లు:

  • RJDSE అనుమతులు వచ్చే వరకు అడ్మిషన్లు, తరగతులను తక్షణమే నిలిపివేయాలి.
  • అనుమతులు లేని రెసిడెన్షియల్ హాస్టల్‌ను సీల్ చేసి విద్యార్థుల భద్రతను కాపాడాలి.
  • FTL (ఫుల్ ట్యాంక్ లెవెల్) / బఫర్ జోన్‌లో నిర్మాణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
  • అనుమతి లేని ‘SPR’ బోర్డులను తొలగించడంతో పాటు దేవరకొండ రోడ్డులోని బ్రాంచ్‌పై కూడా విచారణ చేపట్టాలి.

వినతిపత్రాన్ని స్వీకరించిన అధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాల ఆధారంగా నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సంఘాల నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేతావత్ బాబురామ్ నాయక్, జార్పుల జగన్ నాయక్, ఎండి. సిరాజ్, కే. రమేష్ నాయక్తో పాటు ప్రజా, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS | The Voice of Truth

డయల్-100 కాల్‌కు 5 నిమిషాల్లో స్పందన.. ఉరివేసుకున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన చండూరు హెడ్ కానిస్టేబుల్

AYUSH24 NEWS | నల్లగొండ

నల్లగొండ జిల్లా చండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉడతలపల్లి గ్రామంలో డయల్-100కు అందిన అత్యవసర సమాచారంపై పోలీసులు వేగంగా స్పందించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు.

సమాచారం అందిన కేవలం ఐదు నిమిషాల్లోనే ఘటన స్థలానికి చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్, ఇంట్లో ఉరివేసుకుని అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని గుర్తించారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ప్రధాన ద్వారాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించి వెంటనే ఉరిని తొలగించారు.

అనంతరం బాధితుడికి సీపీఆర్ (CPR) అందించి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేలా చేసి, వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు, మానవత్వంతో వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సమయానికి స్పందించిన పోలీసుల అప్రమత్తతతో మరో ప్రాణం నిలిచింది.

– AYUSH24 NEWS | The Voice of Truth

తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన అడిషనల్ కలెక్టర్ ఎన్. పవన్ కుమార్, ఆర్డీఓ పద్మప్రియ

పుట్టిన గంటలోపే ముర్రుపాలు ఇవ్వాలి.. ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలే ఉత్తమం – ఆర్డీఓ పద్మప్రియ

AYUSH24 NEWS | దేవరకొండ | 03-08-2026

దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పోస్టర్‌ను అడిషనల్ కలెక్టర్ ఎన్. పవన్ కుమార్ మరియు ఆర్డీఓ పద్మప్రియ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆర్డీఓ పద్మప్రియ మాట్లాడుతూ, ప్రసవానికి సమీపంలో ఉన్న ప్రతి గర్భిణీ కుటుంబాన్ని సందర్శించి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించారు. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు (Colostrum) తప్పనిసరిగా ఇవ్వాలని, అలాగే ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలను మాత్రమే అందించాలని సూచించారు.

తల్లిపాలలో సహజసిద్ధమైన వ్యాధి నిరోధక శక్తి ఉండటంతో పాటు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు, ముఖ్యంగా జ్ఞాపకశక్తి (IQ స్థాయి) పెరుగుదలకు ఎంతో దోహదపడుతుందని ఆమె వివరించారు. ప్రతి తల్లి తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించి శిశువుకు పూర్తిస్థాయిలో అందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ శ్రీమతి నిర్మల, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

– AYUSH24 NEWS | The Voice of Truth

పిన్నపురెడ్డి సరోజనమ్మ దశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

రాజవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే

AYUSH24 NEWS | దేవరకొండ

దేవరకొండ మండలం ఇద్దంపల్లి గ్రామంలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) పిన్నపురెడ్డి రాజవర్ధన్ రెడ్డి గారి నానమ్మ పిన్నపురెడ్డి సరోజనమ్మ గారి దశదిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సరోజనమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం రాజవర్ధన్ రెడ్డి గారితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే, సరోజనమ్మ గారి సేవాభావం, కుటుంబ విలువలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. మరణించిన వారి జ్ఞాపకాలు కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని, భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS | The Voice of Truth

AYUSH24 NEWS కథనానికి స్పందన.. దువ్వ వెంకటేశ్వర్ల కుటుంబానికి అండగా నిలిచిన మల్లయ్య టీ స్టాల్ యజమాని గాజుల వంశీ

నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, నగదు అందజేత – దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి

AYUSH24 NEWS | దేవరకొండ | 03-08-2026

దేవరకొండ పట్టణంలోని సంజయ్ కాలనీకి చెందిన దువ్వ వెంకటేశ్వర్లు అనారోగ్యంతో గత రెండు నెలలుగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితి కారణంగా పనికి వెళ్లలేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారడంతో తమను ఆదుకోవాలని AYUSH24 NEWS ద్వారా వేడుకున్నారు.

దీనిపై ఆగస్టు 2న AYUSH24 NEWS ప్రచురించిన కథనానికి స్పందించిన దేవరకొండకు చెందిన ప్రముఖ మల్లయ్య టీ స్టాల్ యజమాన్యం మానవత్వాన్ని చాటుకుంది. సోమవారం మల్లయ్య టీ స్టాల్ ఆధ్వర్యంలో గాజుల వంశీ దువ్వ వెంకటేశ్వర్ల కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు కొంత నగదు సహాయాన్ని వారి నివాసంలో భార్య యాదమ్మకు అందజేశారు.

ఈ సందర్భంగా గాజుల వంశీ మాట్లాడుతూ, మానవత్వంతోనే ఈ సహాయం అందించామని, కుటుంబం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను తెలుసుకుని వెంటనే స్పందించినట్లు తెలిపారు. సమాజంలోని ఇతర దాతలు కూడా ముందుకు వచ్చి వెంకటేశ్వర్ల కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పగిడిమర్రి నాగరాజు, పగిడిమర్రి సతీష్, మసన మణిదీప్, జల్ల అంజి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

AYUSH24 NEWSకు కృతజ్ఞతలు తెలిపిన దువ్వ వెంకటేశ్వర్లు

తన దయనీయ పరిస్థితిని ప్రజలకు చేరవేసి, సహాయం అందేలా కృషి చేసిన AYUSH24 NEWSకు దువ్వ వెంకటేశ్వర్లు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమలాంటి నిరుపేద కుటుంబాలకు మీడియా అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.

– AYUSH24 NEWS | The Voice of Truth

2వ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో రుద్రమదేవి షోటోకాన్ కరాటే అకాడమీ విద్యార్థుల సత్తా – 34 పతకాలతో ఘన విజయం

AYUSH24 NEWS | గజ్వేల్ | 03-08-2026

గజ్వేల్‌కు చెందిన రుద్రమదేవి షోటోకాన్ కరాటే అకాడమీ విద్యార్థులు ఇటీవల నిర్వహించిన 2వ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఘన విజయాన్ని నమోదు చేశారు. అకాడమీ తరఫున పాల్గొన్న 34 మంది విద్యార్థులు మొత్తం 13 బంగారు, 11 వెండి, 10 కాంస్య పతకాలతో మొత్తం 34 పతకాలు సాధించి గజ్వేల్ పట్టణానికి విశేష గౌరవం తీసుకొచ్చారు.

ఈ విజయానికి అకాడమీ ప్రధాన శిక్షకులు మాస్టర్ కృష్ణ (గజ్వేల్) అందించిన నాణ్యమైన శిక్షణ, క్రమశిక్షణతో కూడిన సాధన, విద్యార్థుల అంకితభావమే కారణమని అకాడమీ నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా విజేత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, శిక్షకులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

కరాటే కేవలం ఒక క్రీడ మాత్రమే కాకుండా, ఆత్మరక్షణ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే జీవన విధానం అని నిర్వాహకులు పేర్కొన్నారు.

“కష్టానికి ఫలితం విజయం – క్రమశిక్షణకు గుర్తింపు గౌరవం.”

– AYUSH24 NEWS | The Voice of Truth

దేవరకొండలో ఘనంగా ప్రారంభమైన MG ఎలక్ట్రికల్ స్కూటీ షాప్ – మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

AYUSH24 NEWS | దేవరకొండ | 03-08-2026దేవరకొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన MG ఎలక్ట్రికల్ స్కూటీ షాప్ను దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యజమానులు గండూరి లక్ష్మణ్, సాగర్లకు శుభాకాంక్షలు తెలియజేసి, వ్యాపారం విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోందన్నారు. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటీలు ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా, వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.దేవరకొండలో ఇటువంటి ఆధునిక సేవలు అందుబాటులోకి రావడం స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి, వ్యాపార రంగం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పొట్ట మురళి, పొట్ట మధు, సర్పంచ్ ఆడారపు హరికృష్ణ, బొడ్డుపల్లి కృష్ణ, ఇలియాస్ పటేల్, మాడం రాములు, ముదిగొండ హరిదాస్, అఫ్రోజ్, అంజి, శ్రీనివాస్, షాప్ యజమానులు గండూరి లక్ష్మణ్, సాగర్, పార్టీ నాయకులు, యువకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.– AYUSH24 NEWS