మంథని ఏరియా ఆసుపత్రిలో విధుల్లో చేరిన జనరల్ సర్జన్ డాక్టర్ నికీల్ తేజ
మంత్రి శ్రీధర్ బాబు చొరవతో మంథని ఆసుపత్రికి మరో సర్జన్
మంథని, ఆగస్టు 14, ఆయుష్ 24 న్యూస్:
మంథని ఏరియా ఆసుపత్రికి మరో జనరల్ సర్జన్ అందుబాటులోకి వచ్చారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన నూతన నియామకాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో జనరల్ సర్జన్ డాక్టర్ నికీల్ తేజ మంథని ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం విధుల్లో చేరారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టీవీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మంథని పట్టణంతో పాటు పరిసర మండలాల ప్రజలకు శస్త్రచికిత్సలకు సంబంధించిన మెరుగైన వైద్య సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
మంథని ఏరియా ఆసుపత్రిలో అపెండిసైటిస్, పిత్తాశయంలో రాళ్లు, పిత్తాశయం వాపు, ఇంగ్వైనల్ హెర్నియా, బొడ్డు హెర్నియా, ఇన్సిషనల్ హెర్నియా, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, మలద్వారం చుట్టూ చీము గడ్డలు, పైలోనైడల్ సైనస్, హైడ్రోసీల్, రొమ్ములో గడ్డలు, రొమ్ములో చీము గడ్డలు, లైపోమా, సెబేషియస్ సిస్ట్, శరీరంలో చీము గడ్డలు, డయాబెటిక్ ఫుట్ పుండ్లు, పేగుల అడ్డంకి, పేగుకు రంధ్రం పడటం, పెరిటోనైటిస్ వంటి శస్త్రచికిత్సలకు సంబంధించిన వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
అవసరమైన సందర్భాల్లో లాప్రోస్కోపిక్ సర్జరీలు కూడా అందుబాటులో ఉన్నాయని, అర్హత కలిగిన రోగులకు ఆసుపత్రిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్ తెలిపారు.
ప్రజలు ఈ వైద్య సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వైద్య సేవలకు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను 9885808589 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.
— AYUSH 24 NEWS

