Breaking News
నిరుపేద ఆర్యవైశ్య విద్యార్థినికి ₹43,100 ఆర్థిక సహాయం

ఉన్నత చదువులకు అండగా నిలిచిన దొడ్డి సుధాకర్–సంధ్యారాణి దంపతులు

దేవరకొండ, ఆయుష్ 24 న్యూస్:
పేదరికం కారణంగా ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే సంకల్పంతో దేవరకొండ పట్టణానికి చెందిన దొడ్డి సుధాకర్–సంధ్యారాణి దంపతులు మానవత్వాన్ని చాటుకున్నారు. నిరుపేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన విద్యార్థిని పానుగంటి అంజలి ఉన్నత చదువులు కొనసాగించేందుకు ₹43,100 ఆర్థిక సహాయం అందించారు.

దేవరకొండకు చెందిన వరలక్ష్మి–విశ్వనాథం దంపతుల కుమార్తె అంజలి గతంలో బీఎస్సీ డిగ్రీ విద్యను పూర్తి చేసింది. ఆమె డిగ్రీ చదువుతున్న సమయంలోనూ దొడ్డి అశోక్‌తో పాటు పలువురు దాతలు ఆర్థిక సహాయం అందించారు. దీంతో అంజలి తన డిగ్రీ విద్యను విజయవంతంగా పూర్తి చేసింది.

ప్రస్తుతం అంజలి హైదరాబాద్‌లోని ప్రముఖ సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఐసెట్ ద్వారా ఎంబీఏ సీటు సాధించింది. రెండు సంవత్సరాల ఎంబీఏ కోర్సుకు సుమారు రూ.70 వేల వరకు ఫీజు అవసరం కాగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా రూ.28 వేల వరకు లభించనున్నట్లు అంజలి తెలిపింది. మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితిలో దొడ్డి సుధాకర్–సంధ్యారాణి దంపతులు ముందుకు వచ్చి రూ.43,100 అందించారు.

విద్యాదానం గొప్పదనం

పేదరికం కారణంగా తమ కుమార్తెను ఉన్నత చదువులు చదివించలేని పరిస్థితిలో ఉన్న కుటుంబానికి గతంలో కూడా అండగా నిలిచిన దాతలు, మరోసారి ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు రావడం పట్ల అంజలి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన దొడ్డి కుటుంబానికి చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలిపారు.

చివరి నిమిషంలోనూ అండగా నిలిచిన దొడ్డి కుటుంబం

ఐసెట్ ద్వారా సీటు సాధించిన అంజలి ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ సమీపించడంతో గురువారం దొడ్డి కుటుంబాన్ని సంప్రదించింది. శుక్రవారం ఫీజు చెల్లించాల్సి ఉండటంతో ఆలస్యం జరిగితే ఐసెట్ ద్వారా వచ్చిన సీటును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న దొడ్డి సుధాకర్–సంధ్యారాణి దంపతులు వెంటనే స్పందించి, హైదరాబాద్ నుంచి అంజలిని పిలిపించి అవసరమైన మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా అందించారు.

దొడ్డి కుటుంబ సభ్యుల ముందుచూపు, మానవత్వం, ఆర్థిక సహాయానికి వెలకట్టలేమని అంజలి పేర్కొంది. గతంలోనూ చివరి సమయంలో తన విద్యకు సహాయం అందించారని, ఈసారి కూడా సకాలంలో ఆర్థిక సహాయం అందడంతో తన సీటు నిలుపుకోగలిగానని తెలిపింది.

తన ఉన్నత చదువులు కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందించిన దొడ్డి సుధాకర్–సంధ్యారాణి దంపతులకు జీవితాంతం రుణపడి ఉంటాను. వారి సహకారంతో నా ఎంబీఏ చదువును పూర్తి చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను” అని విద్యార్థిని అంజలి కృతజ్ఞతలు తెలిపింది.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు దొడ్డి సుధాకర్, సంధ్యారాణి, సృజన్, సుమంత్, రేష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *