Breaking News
📰 ముఖ్యమంత్రి పరకాల పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

హనుమకొండ: ఈ నెల 16న పరకాల పట్టణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు రానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.

బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద గారితో కలిసి రెండు జిల్లాల ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం పర్యటనకు సంబంధించిన వేదిక, సభా ప్రాంగణం, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, వైద్య సేవలు, అగ్నిమాపక చర్యలు, భద్రతా ఏర్పాట్లు, హెలిప్యాడ్ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.

భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ముందుగానే పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని సూచించారు. సభా ప్రాంగణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య బృందాలు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రవి, గణేష్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, హనుమకొండ, వరంగల్ జిల్లాల డీఆర్‌డీవోలు, జెడ్పీ సీఈవోలు, పోలీస్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యుత్, అగ్నిమాపక, ట్రాన్స్‌పోర్ట్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

— AYUSH 24 NEWS
The Voice of Truth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *