Breaking News
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలి

పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోంది – బీఆర్ఎస్‌వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ

విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శ

దేవరకొండ | AYUSH24 NEWS

రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్ నిధులను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్‌వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.

గురువారం దేవరకొండ పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్‌వీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం కారణంగా వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకం కలుగుతోందని, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

విద్యార్థుల చదువుకు ఎలాంటి అంతరాయం కలగకుండా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేసి వారి భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యను రాజకీయాలకు అతీతంగా పరిగణించి, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం మరింత ఆలస్యం చేయకుండా పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్‌వీ నాయకులు బత్తుల ఆంజనేయులు, కొర్ర రాజేష్, అనిల్, వెంకటేష్, శ్రీను, రాజు, మధు తదితరులు పాల్గొన్నారు.

— AYUSH24 NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *