అయ్యప్ప నగర్ 12వ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
దేవరకొండ | AYUSH24 NEWS
దేవరకొండ పట్టణంలోని అయ్యప్ప నగర్ 12వ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ వినోద మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు (కొలస్ట్రం) తప్పనిసరిగా పట్టించాలని సూచించారు. తల్లి–బిడ్డల మధ్య స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కల్పించడం వల్ల బిడ్డకు ఆరోగ్యకరమైన ఎదుగుదలతో పాటు తల్లితో బలమైన అనుబంధం ఏర్పడుతుందని తెలిపారు.

ముర్రుపాల వల్ల బిడ్డకు వ్యాధినిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయని, పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఈ కాలంలో తేనె, గ్లూకోజ్ వాటర్ లేదా ఇతర ఆహార పదార్థాలు ఇవ్వకూడదని వివరించారు.
అలాగే బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. కుటుంబ సభ్యులందరూ తల్లి ప్రశాంత వాతావరణంలో బిడ్డకు పాలిచ్చేలా సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది మాట్లాడుతూ, గర్భధారణ 9వ నెలలో ఉన్న మహిళల ఇళ్లను సందర్శించి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
– AYUSH24 NEWS
“The Voice of Truth”

