‘మన ఊరు – మన కోచింగ్ సెంటర్’ ప్రారంభం.. నిరుద్యోగ యువతకు ఉచిత SI, కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావుకు నివాళి.. మూడు నెలలు కష్టపడితే ఉద్యోగం సాధ్యమేనని యువతకు మంత్రి పిలుపు

AYUSH24 NEWS | మంథని
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు గారికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం “మన ఊరు – మన కోచింగ్ సెంటర్” కార్యక్రమంలో భాగంగా మంథని నియోజకవర్గ నిరుద్యోగ యువతను ఉద్యోగులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో శ్రీ విశ్వ అకాడమీ ఆధ్వర్యంలో SI, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ తరగతులను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత ఉద్యోగ సాధనలో విజయాన్ని అందుకోవాలంటే లక్ష్యంపై పూర్తి దృష్టి, క్రమశిక్షణ, నిరంతర కృషి అవసరమని అన్నారు. కేవలం మూడు నెలలు పట్టుదలతో శ్రమిస్తే అనుకున్న గమ్యానికి చేరువ కావచ్చని పేర్కొన్నారు.
ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు నిద్రలేచి చదువుకు సమయం కేటాయించాలని, మూడు నెలలు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చినా భవిష్యత్తు కోసం కష్టపడాలని విద్యార్థులకు సూచించారు. ఉద్యోగం సాధించాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని, కోచింగ్ సెంటర్లో చదువుతో పాటు భోజన సౌకర్యం కూడా కల్పించినట్లు తెలిపారు.

ప్రతిరోజూ నిర్వహించే పరీక్షల్లో వెనుకబడినా నిరాశ చెందకుండా, ఎక్కడ తప్పు జరిగిందో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకొని మరింత మెరుగుపడాలని సూచించారు. యువత తమ భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని, శిక్షణ మధ్యలో మరోసారి వచ్చి విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
– AYUSH24 NEWS | The Voice of Truth

