Breaking News
మంథనిలో అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు వేగం – నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

సమీకృత ఆర్డీవో కార్యాలయం, 50 పడకల ఆసుపత్రి, మున్సిపల్ కార్యాలయ నిర్మాణాల పరిశీలన

బొక్కలవాగు చెక్‌డ్యాం ఆధునికరణకు భూమిపూజ – కోకాకోలా ఫ్యాక్టరీతో యువతకు ఉపాధి అవకాశాలు

AYUSH24 NEWS | మంథని

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సోమవారం పరిశీలించి, నిర్మాణ పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంత్రి సమీకృత ఆర్డీవో కార్యాలయం, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నూతన మున్సిపల్ కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించి వాటి పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం మంథని పట్టణంలోని బొక్కలవాగు చెక్‌డ్యాం ఆధునికరణ, కట్ట సుందరీకరణ పనులకు మంత్రి భూమిపూజ నిర్వహించారు. కోకాకోలా కంపెనీ సీఎస్‌ఆర్ నిధుల కింద రూ.2 కోట్లతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. చెక్‌డ్యాంలో పేరుకుపోయిన సిల్ట్ తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కట్టపై వాక్‌వే, చిన్నారుల పార్క్, పచ్చదనం వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

అదే రోజు రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ శివారులో ప్రతిపాదిత కోకాకోలా ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన సుమారు 250 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, కోకాకోలా సంస్థ ప్రతినిధులతో కలిసి మంత్రి పరిశీలించారు.

ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన భూమి, రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న మంత్రి, పారిశ్రామిక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అన్ని నిబంధనలను పాటిస్తూ తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

కోకాకోలా ఫ్యాక్టరీ ఏర్పాటుతో పెద్దపల్లి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతం లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS | The Voice of Truth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *