ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలి
ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హన్మకొండ కలెక్టరేట్ ముట్టడి

ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలి: మంద నరేష్

హన్మకొండ, ఆగస్టు 8: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు.ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం చేస్తామని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. ఆ హామీలను నమ్మి విద్యార్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారంలోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని మంద నరేష్ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో అనేక మంది విద్యార్థులు చదువులను మధ్యలోనే నిలిపివేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సరైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడంతో పాటు అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనుమతులు లేని విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రానికి పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయకపోతే విద్యార్థుల పక్షాన ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్, కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు అడ్డా రాజేష్, జిల్లా నాయకులు పోతుగంటి ఉదయ్ కిరణ్, కార్తీక్, వెంకటేష్, భాను, సాయి కిరణ్, ప్రసన్న, కళ్యాణి, ప్రవళిక, పల్లవి తదితరులు పాల్గొన్నారు.– AYUSH24 NEWSThe Voice of Truth

