Breaking News
వన మహోత్సవంతో ప్రారంభమైన మండల జనరల్ బాడీ సమావేశం

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జాప్యం చేయొద్దు: ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

త్వరలో రూ.15 కోట్లతో మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయాల సముదాయం

కొండమల్లేపల్లి, ఆగస్టు 7 | AYUSH24 NEWS:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ వివిధ శాఖల అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించి భావితరాలకు పచ్చని తెలంగాణను అందించాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం మండల కార్యాలయంలో నిర్వహించిన మండల జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని, అధికారులు గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.సమావేశంలో మండల తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్, ఉపాధి హామీ, పౌర సరఫరాలు, అటవీ, హౌసింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మండలంలోని సర్పంచులు కూడా సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచులు తమ గ్రామాల్లోని తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సమస్యలు, సాగునీరు, పాఠశాలల్లో మౌలిక వసతులు, అంగన్‌వాడీ భవనాలు, వైద్య సేవలు, రేషన్ పంపిణీ, ఉపాధి హామీ పనులు, పెండింగ్ అభివృద్ధి పనులు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. తాగునీటి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను, పాడైన ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంతర్గత రహదారులు, కమ్యూనిటీ భవనాలు తదితర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులకు సూచించారు. మహిళా సంఘాల బలోపేతం, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, ఉపాధి హామీ పనుల సమర్థవంతమైన అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.అలాగే త్వరలో రూ.15 కోట్లతో కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయాల సముదాయం భవనాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.“అధికారులు ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలి. నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదు. ప్రజల సమస్యల పరిష్కారమే మనందరి ప్రథమ కర్తవ్యం” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, మండలంలోని వివిధ శాఖల అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.– AYUSH24 NEWSప్రజల గొంతుక – నిజమైన వార్తలకు విశ్వసనీయ వేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *