‘SPR’ పాఠశాల అక్రమాలపై జిల్లా అధికారులకు ప్రజా, విద్యార్థి సంఘాల ఉమ్మడి ఫిర్యాదు
అక్రమ అడ్మిషన్లు, అనుమతుల్లేని హాస్టల్, FTL పరిధిలో నిర్మాణంపై విచారణకు డిమాండ్
AYUSH24 NEWS | నల్లగొండ
కొండమల్లేపల్లిలోని ‘SPR’ (సర్వేపల్లి రాధాకృష్ణ) హైస్కూల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ కొనసాగుతోందని ఆరోపిస్తూ, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి (DEO), జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం ఉమ్మడిగా వినతిపత్రాలు సమర్పించారు.
రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ (RTISS) ఆధ్వర్యంలో TNSF, YSRSU, SHPS తదితర సంఘాల ప్రతినిధులు అధికారులను కలిసి పాఠశాల యాజమాన్యం చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ పలు ఆధారాలను సమర్పించారు.
ఈ సందర్భంగా RTISS ఫౌండర్ & నేషనల్ ప్రెసిడెంట్ కేతావత్ బాబురామ్ నాయక్, TNSF దేవరకొండ ఇన్చార్జ్ జార్పుల జగన్ నాయక్, YSRSU జిల్లా అధ్యక్షుడు ఎండి. సిరాజ్, SHPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. రమేష్ నాయక్ మాట్లాడుతూ, RJDSE హైదరాబాద్ ప్రొసీడింగ్స్ ప్రకారం ‘SPR’ పేరును వినియోగించరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ యాజమాన్యం వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అలాగే G.O.Ms.No.1 ప్రకారం అధికారిక అనుమతి వచ్చే వరకు తరగతులు నిర్వహించడం, కొత్త అడ్మిషన్లు చేపట్టడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
ప్రధాన డిమాండ్లు:
- RJDSE అనుమతులు వచ్చే వరకు అడ్మిషన్లు, తరగతులను తక్షణమే నిలిపివేయాలి.
- అనుమతులు లేని రెసిడెన్షియల్ హాస్టల్‌ను సీల్ చేసి విద్యార్థుల భద్రతను కాపాడాలి.
- FTL (ఫుల్ ట్యాంక్ లెవెల్) / బఫర్ జోన్లో నిర్మాణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
- అనుమతి లేని ‘SPR’ బోర్డులను తొలగించడంతో పాటు దేవరకొండ రోడ్డులోని బ్రాంచ్‌పై కూడా విచారణ చేపట్టాలి.
వినతిపత్రాన్ని స్వీకరించిన అధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాల ఆధారంగా నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సంఘాల నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేతావత్ బాబురామ్ నాయక్, జార్పుల జగన్ నాయక్, ఎండి. సిరాజ్, కే. రమేష్ నాయక్‌తో పాటు ప్రజా, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
– AYUSH24 NEWS | The Voice of Truth

