తెలంగాణ ఉద్యమ యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి కన్నీరుమున్నీరుగా తుది వీడ్కోలు
హనుమకొండ నుంచి గిర్నిబావి వరకు అభిమానుల మధ్య అంతిమయాత్ర
హనుమకొండ/వరంగల్, AYUSH24 NEWS:
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన పార్థివ దేహం హనుమకొండకు చేరుకోగా, వేలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కన్నీరుమున్నీరుగా నివాళులర్పించారు.
హనుమకొండ అదాలత్ జంక్షన్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే వేదికపై అనేక ఆందోళనలకు నాయకత్వం వహించిన పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇప్పుడు అదే స్థూపం వద్ద ప్రజల కన్నీటి వీడ్కోలు అందుకోవడం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసింది.

అనంతరం ఆయన భౌతికకాయాన్ని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామానికి తరలించారు. గ్రామానికి చేరుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తుది దర్శనం చేసుకుని నివాళులర్పించారు. గ్రామమంతా శోకసంద్రంగా మారగా, అభిమానుల నినాదాల మధ్య అంతిమయాత్ర కొనసాగింది.
అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు
1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన, 2001లో కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో కీలక నాయకుడిగా ఎదిగారు.

2001లో దుగ్గొండి నుంచి జడ్పీటీసీగా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, పార్టీ ఫ్లోర్ లీడర్‌గా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమమే జీవిత లక్ష్యం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర సాధన అనంతరం 2017లో లక్ష్మీ ప్రసన్న (స్వప్న)ను వివాహం చేసుకోవడం ఆయన ఉద్యమ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.
ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు
2014లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ ప్రజలతో అనుబంధాన్ని కొనసాగించారు. 2016లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్) ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా సేవలందించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. 2023 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసినప్పటికీ ఓటమి చవిచూశారు.
సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా…
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన ఉద్యమ నాయకుడిగా, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన ప్రజానాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
— AYUSH24 NEWS
“THE VOICE OF TRUTH”

