అజ్మాపురం నరసింహుల కుంటను కబ్జా నుంచి కాపాడాలి.. అధికారులను వేడుకుంటున్న రైతులు, మత్స్యకారులు
రాత్రికి రాత్రే హద్దురాళ్లు, మట్టి దిబ్బలు, సిమెంట్ పలకల నిర్మాణం.. సర్వే అనంతరం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్

AYUSH24 NEWS | పీఏ పల్లి
పీఏ పల్లి మండలంలోని అజ్మాపురం గ్రామ శివారులో ఉన్న నరసింహుల కుంట కబ్జాకు గురవుతోందని గ్రామ రైతులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాల సంరక్షణతో పాటు మత్స్యకారుల జీవనాధారంగా ఉన్న ఈ కుంటను కబ్జాదారుల నుంచి కాపాడాలని అధికారులను కోరుతున్నారు.
సోమవారం చెరువు చైర్మన్ గడియ బాలయ్యతో పాటు అంబటి సత్యనారాయణ, అంబటి కృష్ణయ్య, చింతకాయల సైదయ్య, అంబటి వెంకటేశం, అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ, కొంతమంది అక్రమార్కులు రాత్రికి రాత్రే కుంటను ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
కుంటలో హద్దురాళ్లు ఏర్పాటు చేయడంతో పాటు, భారీగా మట్టి పోసి, సిమెంట్ పలకల గోడను నిర్మించారని పేర్కొన్నారు. దీంతో చెరువు విస్తీర్ణం తగ్గిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల రైతులు, మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయమై AYUSH24 NEWS మండల తహసీల్దార్‌ను వివరణ కోరగా, ఈ అంశం తన దృష్టికి రాలేదని తెలిపారు. ప్రస్తుతం ఆన్‌లైన్ సర్వేలు కొనసాగుతున్నాయని, వారం రోజుల్లో నరసింహుల కుంటకు సర్వే నిర్వహించి, కబ్జా జరిగినట్లు తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గ్రామస్థులు, రైతులు, మత్స్యకారులు చెరువును వెంటనే రక్షించి, అక్రమ ఆక్రమణలను అడ్డుకోవాలని సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేశారు.
– AYUSH24 NEWS | The Voice of Truth










