Breaking News
ఉప్పల్ తాత్కాలిక బస్టాండ్ వద్ద అధ్వానంగా రోడ్ల దుస్థితి

బురదలో కూరుకుపోయిన సూపర్ లగ్జరీ బస్సు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

ఉప్పల్ | AYUSH24 NEWS

ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాలకు వెళ్లే బస్సుల తాత్కాలిక బస్టాప్ వద్ద రోడ్ల దుస్థితి తీవ్రంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బస్టాండ్ పరిసర ప్రాంతం పూర్తిగా బురదమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బస్టాప్ వద్ద మట్టి, బురద పేరుకుపోవడంతో ప్రజలు నడవడానికి కూడా వీలు లేకుండా పరిస్థితి నెలకొంది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు బస్సులు ఎక్కడానికి, దిగడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అధ్వానంగా మారిన రహదారి కారణంగా ఓ సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు సైతం బురదలో కూరుకుపోవడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. దీంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ప్రజలు, ప్రయాణికులు స్పందిస్తూ బస్టాండ్ పరిసర ప్రాంతంలో వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

– AYUSH24 NEWS
“The Voice of Truth”

అంతర్ రాష్ట్ర పుణ్యక్షేత్రాలకు దేవరకొండ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు

దేవరకొండ | AYUSH24 NEWS

దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో “పుణ్యక్షేత్ర దర్శిని” పేరుతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు డీలక్స్, సూపర్ లగ్జరీ (పుష్ బ్యాక్ సీట్లు) ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ విజయకుమారి తెలిపారు.

ప్రస్తుత ఆషాఢ మాసం మరియు రాబోయే శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని భక్తులకు తక్కువ సమయంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత కోసం అనుభవజ్ఞులైన డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి యాత్రలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

🛕 పుణ్యక్షేత్రాల వివరాలు

  • ఆలంపూర్, బీచుపల్లి, శ్రీరంగాపురం, జటప్రోలు, సోమశిల, కొల్లాపూర్, సింగోటం
  • ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, కొమురవెల్లి
  • భద్రాచలం, మల్లూరు, మేడారం, రామప్ప దేవాలయం
  • కాలేశ్వరం, భద్రకాళి ఆలయం (వరంగల్), వేయి స్తంభాల గుడి (హనుమకొండ)
  • పంచదేవ్ పహాడ్, మఖ్తల్, మన్యంకొండ, కురుమూర్తి, గంగాపూర్
  • విజయవాడ, పెద్దపులిపాక, పెనుగొండ, వాడపల్లి
  • కొల్హాపూర్, జ్యోతిబా, పండరిపూర్, తుల్జాపూర్, గానగాపూర్
  • మంత్రాలయం, పంచముఖి, దేవసుగూర్, మన్యంకొండ

అంతేకాకుండా, కనీసం 30 మంది భక్తులు ఉంటే వారు కోరుకున్న పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని డిపో మేనేజర్ తెలిపారు. అందుబాటు ధరల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ఈ సందర్భంగా దేవరకొండ ప్రాంత భక్తులు, ప్రయాణికులు ఆర్టీసీ పుణ్యక్షేత్ర దర్శిని బస్సులను సద్వినియోగం చేసుకుని సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ యాత్రలను పూర్తి చేసుకోవాలని డిపో మేనేజర్ విజయకుమారి కోరారు.

📞 పూర్తి వివరాలకు: 98488 47419 లేదా దేవరకొండ ఆర్టీసీ డిపోను సంప్రదించవచ్చు.

– AYUSH24 NEWS
“The Voice of Truth”

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రేపని అంజయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ | AYUSH24 NEWS

దేవరకొండ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేపని అంజయ్య ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ బుధవారం వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేపని అంజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని, అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

రేపని అంజయ్య పార్టీ అభివృద్ధి కోసం విశేష సేవలందించారని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ ఎం.ఏ. సిరాజ్ ఖాన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు లోకసాని శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకుడు మునుకుంట్ల వెంకట్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొర్ర రాంసింగ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, సీనియర్ నాయకుడు వైఎస్ కర్ణాకర్, సర్పంచులు నేనావత్ కవిత–లచ్చిరాం, నేనావత్ పాండు, రామావత్ బాబురామ్, జబ్బు అంజి యాదవ్, కోఠి, చరణ్, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS
“The Voice of Truth”

చికిత్స కోసం రూ.2.50 లక్షల LOC అందజేత

అనారోగ్యంతో బాధపడుతున్న సాయి రాజ్‌కు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భరోసా

మంథని | AYUSH24 NEWS

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో మంథని నియోజకవర్గం, కాటారం మండలం, దేవరాంపల్లి గ్రామానికి చెందిన చీమల సాయి రాజ్ (తండ్రి: చీమల నర్సింహులు) వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.2,50,000 లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) మంజూరు చేశారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి రాజ్‌కు వైద్య ఖర్చుల కోసం సహాయం అవసరమని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన మంత్రి CMRF ద్వారా రూ.2.50 లక్షల LOC మంజూరు చేయించి, హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆసుపత్రి సహాయకుల ద్వారా సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించి తమ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు సాయి రాజ్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

“దుద్దిళ్ల హస్తం – పేదల నేస్తం” అంటూ స్థానికులు మంత్రి సేవలను అభినందించారు.

– AYUSH24 NEWS
“The Voice of Truth”

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

AYUSH24 NEWS

ఇటీవల పదవీ విరమణ పొందిన విశ్రాంత ఉపాధ్యాయులు బిరుదు మధు, బోనాల రవీందర్లను పెంజెరుట్ట కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు లోకే మనోహర్, టేక్కేగారి రాధాకృష్ణన్ శాలువాలు కప్పి ఉపాధ్యాయులను సత్కరించి, వారి సేవలను కొనియాడారు.

విద్యారంగంలో ఎన్నో సంవత్సరాల పాటు సేవలందిస్తూ, వేలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన ఈ ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని, వారి సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది కేతిరెడ్డి రఘోతం రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోటికార్ కిషన్ జీ, మంథని రమేష్, రాంపల్లి లక్ష్మణ్, పల్లి మధుసూదన్ తదితరులు పాల్గొని పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

– AYUSH24 NEWS
“The Voice of Truth

అయ్యప్ప నగర్ 12వ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

దేవరకొండ | AYUSH24 NEWS

దేవరకొండ పట్టణంలోని అయ్యప్ప నగర్ 12వ అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ వినోద మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు (కొలస్ట్రం) తప్పనిసరిగా పట్టించాలని సూచించారు. తల్లి–బిడ్డల మధ్య స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కల్పించడం వల్ల బిడ్డకు ఆరోగ్యకరమైన ఎదుగుదలతో పాటు తల్లితో బలమైన అనుబంధం ఏర్పడుతుందని తెలిపారు.

ముర్రుపాల వల్ల బిడ్డకు వ్యాధినిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయని, పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఈ కాలంలో తేనె, గ్లూకోజ్ వాటర్ లేదా ఇతర ఆహార పదార్థాలు ఇవ్వకూడదని వివరించారు.

అలాగే బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. కుటుంబ సభ్యులందరూ తల్లి ప్రశాంత వాతావరణంలో బిడ్డకు పాలిచ్చేలా సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ సిబ్బంది మాట్లాడుతూ, గర్భధారణ 9వ నెలలో ఉన్న మహిళల ఇళ్లను సందర్శించి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS
“The Voice of Truth”

తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూతన పాలకవర్గానికి ఘన సన్మానం

దేవరకొండ | AYUSH24 NEWS

తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూతన పాలకవర్గం అభినందన సభ మంగళవారం హైదరాబాద్‌ వనస్థలిపురంలోని కర్నాటి గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవరకొండ చేనేత సహకార సంఘం అధ్యక్షులు చేరిపల్లి బాలరాజు, ఉపాధ్యక్షులు చిలువేరు స్వామి నందీశ్వర్, ప్రధాన కార్యదర్శి పున్న గోవర్ధన్, కోశాధికారి వనం శ్రీనివాసులులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

అనంతరం సహకార చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించి, నూతన పాలకవర్గ సభ్యులకు చట్టపరమైన అంశాలు, సంఘాల నిర్వహణపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతి కుమార్, రిటైర్డ్ ఆర్డీవో ఎం. వెంకటేశం హాజరై మాట్లాడుతూ, నూతన చేనేత సహకార సంఘాల పాలకవర్గ సభ్యులు చేనేత రంగ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే, ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు ప్రత్యేకంగా తగిన నిధులు కేటాయించి, చేనేత కార్మికుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ చేనేత సహకార సంఘం సభ్యులు పగిడిమర్రి శ్రీనివాస్తో పాటు పలువురు చేనేత కార్మికులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS
“The Voice of Truth”

జాతీయ కరాటే పోటీలకు ఢిల్లీకి ఎంపికైన మంథని విద్యార్థులు

మంథని, పెద్దపల్లి జిల్లా:
ఢిల్లీలోని తాల్‌కటోర ఇండోర్ స్టేడియంలో ఈ నెల 7, 8, 9 తేదీలలో నిర్వహించనున్న జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలకు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన జపాన్ షిటోరియు శికోకాయ్ కరాటే ఇంటర్నేషనల్ అకాడమీ విద్యార్థినీ, విద్యార్థులు ఎంపిక కావడం విశేషం.

అకాడమీ శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులు సబ్ జూనియర్స్ కతా, కుమితే మరియు జూనియర్స్ కతా, కుమితే విభాగాల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు.

ఎంపికైన విద్యార్థులు:

🥋 ఎలా వేనా నిషిత్ – 30 కేజీల విభాగం
🥋 మారేడుకొండ రిషి – 25 కేజీల విభాగం
🥋 ఆదిమూలపు అభిజ్ఞ సిరి – 35 కేజీల విభాగం
🥋 ఎం.డి. తహసీన్ తైబా – జూనియర్స్ కతా & కుమితే, 76 కేజీల విభాగం

జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన విద్యార్థులను షిటోరియు శికోకాయ్ కరాటే ఇండియా & KIO అధ్యక్షులు పి. భరత్ శర్మ, తెలంగాణ షిటోరియు శికోకాయ్ కరాటే రిప్రజెంటేటివ్ పాలకుర్తి పాపయ్య, కార్యనిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే-డో అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మల్యాల రామస్వామి, సీనియర్ కరాటే శిక్షకులు చైతన్య, అలాగే ఇన్‌స్ట్రక్టర్లు నాగళ్లి రాకేష్, కావేటి శివ, గణేష్, జడగల శివ అభినందిస్తూ, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి తెలంగాణకు, మంథని ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఆగస్టు 15లోపు కాంగ్రెస్ కమిటీలు పూర్తి చేయాలి.. లేకుంటే ‘మాజీ’ అనే పదం జోడించుకోవాల్సిందే: టీపీసీసీ

డీసీసీ అధ్యక్షులకు టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు – మండల, టౌన్, డివిజన్ కమిటీల ఏర్పాటుకు గడువు

AYUSH24 NEWS | హైదరాబాద్

ఏఐసీసీ మార్గదర్శకాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మండల, టౌన్, డివిజన్ కాంగ్రెస్ కమిటీలను ఆగస్టు 15లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్ణయించిన గడువులోపు కమిటీలను పూర్తి చేయని పక్షంలో సంబంధిత పదవులకు “మాజీ” అనే పదం జోడించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆలస్యం చేయకుండా మండల, టౌన్, డివిజన్ స్థాయిలో పార్టీ అధ్యక్షులను వెంటనే ఎంపిక చేసి, కమిటీలను పూర్తి చేసి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు.

పార్టీ బలోపేతంలో ప్రతి నాయకుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సంస్థాగత నిర్మాణాన్ని గడువులోపు పూర్తి చేయడం అత్యంత కీలకమని టీపీసీసీ పేర్కొంది.

“ఆగస్టు 15 గడువు… కమిటీలు పూర్తి చేయండి… కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయండి!”

– AYUSH24 NEWS | The Voice of Truth

అనుమతులు లేని ‘ఎస్‌పీఆర్ హైస్కూల్’, అక్రమ హాస్టల్‌ను తక్షణమే సీజ్ చేయాలి: ఎంఈఓకు విద్యార్థి, ప్రజా సంఘాల వినతి

హైకోర్టు, విద్యాశాఖ ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ – అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

AYUSH24 NEWS | కొండమల్లేపల్లి | 04-08-2026

కొండమల్లేపల్లిలో అనుమతులు లేకుండా నడుస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ఎస్‌పీఆర్ హైస్కూల్’ మరియు అనుమతి లేని రెసిడెన్షియల్ హాస్టల్‌పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు మంగళవారం మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ)కు వినతిపత్రం సమర్పించారు.

రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ (RTISS) ఫౌండర్, నేషనల్ ప్రెసిడెంట్ కేతావత్ బాబురామ్ నాయక్ ఆధ్వర్యంలో టి.ఎన్.ఎస్.ఎఫ్. దేవరకొండ ఇన్‌ఛార్జ్ జార్పుల జగన్ నాయక్, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఎండి. సిరాజ్, ఎస్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. రమేష్ నాయక్, ఎన్‌ఎస్‌యూఐ నేషనల్ కో-ఆర్డినేటర్ పి. శ్రీకాంత్తో పాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు ఈ వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ హైకోర్టు, కమర్షియల్ కోర్టు, ప్రాంతీయ విద్యా సంచాలకుల (RJDSE) ఉత్తర్వుల ప్రకారం ‘ఎస్‌పీఆర్ హైస్కూల్’ పేరును వినియోగించరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, యాజమాన్యం చట్టవిరుద్ధంగా తరగతులు, అడ్మిషన్లు నిర్వహిస్తోందని ఆరోపించారు.

అలాగే, ప్రభుత్వ అనుమతులు, ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ లేకుండా రెసిడెన్షియల్ హాస్టల్ నిర్వహించడం వల్ల విద్యార్థుల భద్రత ప్రమాదంలో పడుతోందని పేర్కొన్నారు. పాఠశాల భవనం చెరువు ఎఫ్‌టీఎల్ (Full Tank Level) / బఫర్ జోన్ పరిధిలో ఉందని, దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో కలిసి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం (RTE Act-2009), తెలంగాణ విద్యా చట్టం-1982 నిబంధనల ప్రకారం గుర్తింపు లేని పాఠశాల నిర్వహణపై జరిమానాలు విధించడంతో పాటు, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, అక్రమ పాఠశాల, హాస్టల్‌ను సీజ్ చేసి పూర్తి నివేదికను జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ)కు పంపించాలని ఎంఈఓను కోరారు.

ఈ కార్యక్రమంలో కేతావత్ బాబురామ్ నాయక్, జార్పుల జగన్ నాయక్, ఎండి. సిరాజ్, కె. రమేష్ నాయక్, పి. శ్రీకాంత్, బి. వెంకటేష్, కె. నరేష్, వి. ఆంజనేయులు, రామ్‌దాస్, రాజు నాయక్తో పాటు వివిధ విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS | The Voice of Truth