పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
తరగతులు బహిష్కరించి ఆర్డీవోకు వినతిపత్రం అందజేసిన బీసీ సంక్షేమ సంఘం
విద్యార్థుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి : డా. చింతపల్లి శ్రీనివాస్ గౌడ్
దేవరకొండ టౌన్, జూలై 31 (AYUSH24 NEWS) ప్రతినిధి…:
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవరకొండలో విద్యార్థులు, సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు.
రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా వందలాది మంది విద్యార్థులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవో పి. పద్మప్రియకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, సామాజికవేత్త డా. చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బహుజన విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రెడ్డి కోటేశ్వరరావు, చోల్లేటి భాస్కరాచారి, పున్న బిక్షమయ్య, భీమవోని శివ గౌడ్, మునగాల గణేష్, జెల్లా వెంకటయ్య గౌడ్, రామావత్ పాండు, పులిగోర్ల రాంబాబు, కొత్తూరు కృష్ణప్రసాద్, కుంభం బాలచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
— AYUSH24 NEWS
THE VOICE OF TRUTH




